అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అరెస్టయ్యారు. 2020 నాటి అధ్యక్ష ఎన్నికల్లో ఆక్రమాలు, అవకతవకలు, ఫలితాల్లో జోక్యం, కుట్ర వంటి ఆరోపణలు ట్రంప్ ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన అట్లాంటా ఫుల్టన్ కౌంటీ జైలు వద్ద పోలీసుల ఎదుట లొంగిపోయారు.
దీంతో ఆయన్ని అరెస్ట్ చేశారు. జైలులో 20 నిమిషాలపాటు గడిపారు. అనంతరం 2 లక్షల డాలర్ల పూచికత్తుతో విడుదలయ్యారు. ట్రంప్‌పై నమోదైన నాలుగు క్రిమినల్ కేసుల్లో ఇదీ ఒకటి. గురువారం రాత్రి 7 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) ట్రంప్ ఆట్లాంటాకు వెళ్లారు. ఆయన అరెస్ట్, విడుదలకు సంబంధించిన ప్రక్రియ కేవలం 20 నిమిషాల్లోనే ముగిసిపోవడం విశేషం.
అయితే జైలు అధికారులు ట్రంప్‌కు సంబంధించి పలు వివరాలు తీసుకున్నారు. 77 ఏండ్ల ట్రంప్ 6 అడుగుల 3 ఇంచ్‌ల ఎత్తు, 215 పౌండ్ల బరువు ఉన్నట్లు తమ రికార్డుల్లో నమోదు చేసుకున్నారు. ఆయనకు స్ట్రాబెరీ లేదా బ్లాండ్ జట్టు ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా జైలు అధికారులు ఆయనతో ఫొటోలు దిగారు. ట్రంప్ గత మార్చి నుంచి కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఆయనపై నాలుగు నగరాల్లో అనేక కేసులు నమోదయ్యాయి. వాటిలో కొన్నింటిలో ఆయన దోషిగా కూడా తేలారు.
కాగా, ఇన్ని కేసులు ఎదుర్కొంటున్నప్పటికీ ట్రంప్ తనని తాను వెనకేసుకొచ్చుకుంటున్నారు. తాను ఏ తప్పు చేయలేదని, ప్రభుత్వం తనపై కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతున్నని ఆరోపించారు. పైగా, దేశ చరిత్రలో తన అరెస్ట్ ఒక చీకటి రోజుగా మిగిలిపోతుందని పేర్కొంటున్నారు.