ఆసియాకప్‌లో భాగంగా చిరకాల ప్రత్యర్థులు భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య శనివారం జరిగిన లీగ్ మ్యాచ్ వర్షం కారణంగా అర్ధాంతరంగా రద్దయ్యింది. పల్లెకెలె వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌కు ఆరంభం నుంచే వర్షం అడ్డంకిగా మారింది. టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్‌ను ఎంచుకుంది. టీమిండియా ఇన్నింగ్స్‌కు రెండు సార్లు వర్షం అంతరాయం కలిగించింది.
చివరికి భారత్ 48.5 ఓవర్లలో 266 పరుగులకు ఆలౌటైంది. అనంతరం మళ్లీ వర్షం ప్రారంభం కావడంతో పాకిస్థాన్ ఇన్నింగ్స్ సాధ్యం కాలేదు. ఎడతెరిపి లేని వర్షం కారణంగా మైదానం మొత్తం చిత్తడిగా తయారైంది. దీంతో ఓవర్లను కుదించి మ్యాచ్‌ను నిర్వహించే పరిస్థితి కూడా లేకుండా పోయింది.
ఇక పలు సార్లు మైదానాన్ని పరిశీలించిన అంపైర్లు చివరికి మ్యాచ్‌ను రద్దు చేయాలని నిర్ణయించారు. మ్యాచ్ రద్దు కావడంతో భారత్, పాకిస్థాన్‌లకు చెరో పాయింట్ లభించింది. మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియాను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో పాక్ బౌలర్లు సఫలమయ్యారు. వర్షం వల్ల పిచ్ బౌలర్లకు సహకరించింది.
దీన్ని తమకు అనుకూలంగా మార్చుకోవడంలో పాక్ బౌలర్లు సఫలమయ్యారు. చివరికి భారత్‌ను 266 పరుగులకే కట్టడి చేశారు. టీమిండియాలో ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యలు మాత్రమే మెరుగైన బ్యాటింగ్‌ను కనబరిచారు. ఒక దశలో 66 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన జట్టును వీరిద్దరూ ఆదుకున్నారు.
ఇషాన్ 82, హార్దిక్ 87 పరుగులు చేశారు. ఓపెనర్లు రోహిత్ శర్మ (11), గిల్ (10), కోహ్లి (4), శ్రేయస్ (14) విఫలమయ్యారు. పాక్ బౌలర్లలో షాహీన్ అఫ్రిది నాలుగు, నసీమ్ షా, హారిస్ రవూఫ్ మూడేసి వికెట్లు తీశారు.’