25 ఏళ్ల లోపు యువత గోవింద కోటిని రాస్తే వారి కుటుంబానికి వీఐపీ దర్శనం కల్పిస్తామని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి వెల్లడించారు. ఆయన అధ్యక్షతన మంగళవారం జరిగిన తొలి పాలకమండలి సమావేశంలో సనాతన ధర్మ వ్యాప్తి జరగాలని, యువతలో భక్తి పెంచడానికి అనేక నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు.
రామకోటి మాదిరిగా గోవింద కోటి రాయించాలని నిర్ణయించామని పేర్కొన్నారు ముంబాయి బాంద్రాలో వేంకటేశ్వరస్వామి ఆలయం, సమాచార కేంద్రం నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అలాగే 29 స్పెషలిస్ట్, 15 చిన్నపిల్లల వైద్యులతో పాటు 300 మంది ఉద్యోగుల నియామకానికి ఆమోదం తెలిపినట్లు చెప్పారు.
వీటితో పాటు రూ. 2.16 కోట్లతో టీటీడీ ఆస్పత్రుల్లో మెడిసిన్ కొనుగోలు, 47 వేద అధ్యాపక పోస్టుల నియామకాలకు పాలకమండలి సమావేశం ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. స్వామివారి వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 18 నుంచి 26 వరకూ జరుగుతాయని చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి తెలిపారు.
అధిక మాసం కావడం వల్ల అక్టోబర్‌లో నవరాత్రి బ్రహ్మోత్సవాలు () జరుగుతాయని తెలిపారు. సాలకట్ల బ్రహ్మోత్సవాలకు సెప్టెంబర్ 18న ధ్వజారోహణం సందర్భంగా సీఎం జగన్ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని, అదే రోజు టీటీడీ క్యాలెండర్లు, డైరీలను ఆవిష్కరిస్తారని పేర్కొన్నారు.
రూ. 2 కోట్ల వ్యయంతో చంద్రగిరి మూలస్థాన ఆలయ పునఃనిర్మాణం, రూ. 49.5 కోట్లతో టీటీడీ ఉద్యోగుల క్వార్టర్స్ మరమత్తు పనులకు నిధులు కేటాయించామని తెలిపారు. పోటులో పెండింగ్‌లో ఉన్న 413 పోస్టుల భర్తీకి ప్రభుత్వ అనుమతికి విజ్ఞప్తి చేయాలని సమావేశం నిర్ణయించినట్లు చెప్పారు. తిరుపతిలోని టీటీడీ ఉద్యోగులు నివాసం ఉంటున్న కేశవాయనగుంట వద్ద అభివృద్ధి పనులకు రూ.4.15 కోట్లు కేటాయించామని వివరించారు.
