జమ్మూకశ్మీరుకు స్వయంప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ పిటిషన్లపై 16 రోజుల పాటు సుదీర్ఘంగా విచారణ జరిపింది.
కపిల్ సిబాల్, గోపాల్ సబ్రమణ్యం, రాజీవ్ ధావన్, జాఫర్ షా, దుష్యంత్ దవే తదితర సీనియర్ న్యాయవాదులు పిటిషన్లపై మంగళవారం తమ తుది వాదనలు వినిపించారు. పిటిషనర్లు, ప్రతివాదుల తరఫున ఇంకా ఎవరైనా న్యాయవాది లిఖితపూర్వక సమాధానం సమర్పించాలనుకుంటే మూడు రోజుల్లోగా ఇవ్వొచ్చని ధర్మాసనం తెలిపింది.
ఆ సమాధానం రెండు పేజీలకు మించకూడదని స్పష్టం చేసింది. కాగా, ఆర్టికల్ 370 రద్దును సమర్థిస్తూ కేంద్ర ప్రభుత్వం, పిటిషనర్ల తరఫున అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, సీనియర్ న్యాయవాదులు హరీశ్ సాల్వే, రాకేశ్ ద్వివేది, వి.గిరి తదితరులు వాదనలు వినిపించారు.
ఇరు పక్షాల వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం.. తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది. ఇదిలా ఉండగా, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు.. ‘‘భారతదేశం పట్ల విధేయంగా ఉంటాను’’ అని నేషనల్ కాన్ఫరెన్స్ ఎంపీ మహ్మద్ అక్బర్ లోన్ మంగళవారం అఫిడవిట్ సమర్పించారు.
సుప్రీంలో జరిగిన వాదనలపై తాము సంతృప్తితో ఉన్నామని పిటిషన్ దాఖలు చేసిన నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు మసూది తెలిపారు. ఆగస్ట్ 2న విచారణ ప్రారంభమై 16 రోజుల పాటు ఈ కేసుపై ఇరుపక్షాలు తమ వాదనలను వినిపించాయి.
పిటిషనర్ల తరుపున కపిల్ సిబల్, జఫర్ షా, గోపాల్ సుబ్రమణ్యం, రాజీవ్ థావన్, దుష్యంత్ దవే, దినేష్ ద్వివేది సహా సీనియర్ న్యాయవాదులు తమ వాదల్ని వినిపించారు. భారత ప్రభుత్వం తరుపున అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఆర్ వెంకటరమణి, సోలిసిటర్ జనరల్ తుషార్ మోహతా, అదనపు సోలిసిటర్ జనరల్ కెఎం నటరాజ్ వాదనల్ని వినిపించారు.