మార్గదర్శి మోసాలపై సిఐడి విచారణకు సంబంధించి తప్పుడు కథనాలు వస్తున్నాయని ఎపి సిఐడి అడిషనల్ డిజిపి ఎన్.సంజయ్ తెలిపారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ మార్గదర్శి చిట్‌ఫండ్స్‌పై అనుకూలంగా కథనాలు పేపరులో వస్తున్నాయని, ప్రజలు అవే నిజమని అనుకునే ప్రమాదముందని పేర్కొన్నారు.
చిట్‌ఫండ్‌లో జరిగిన మోసాలపై గతంలో కూడా సిఐడి తెలియజేసిందని ఆయన చెప్పారు. మార్గదర్శి పెద్ద ఆర్థిక స్కాం అని, చాలా నిబంధనలు అతిక్రమించిందని తెలిపారు. మార్గదర్శి మోసాలపై ప్రజలకు నిజాలు తెలియాలని స్పష్టం చేశారు. కోట్ల రూపాయలు కట్టిన బాధితులకు మార్గదర్శి నుంచి వేలల్లో మాత్రమే అందిందని ఆరోపించారు.
చిట్స్ నిబంధనలను మార్గదర్శి పాటించడం లేదని ఆయన విమర్శించారు. మార్గదర్శి మోసాలపై ఐటీ, ఈడీలకు సమాచారమిచ్చామని సంజయ్ వెల్లడించాయిరు. కోటికి పైగా చిట్స్ వేసిన బాధితులు 800 మందికి పైగా ఉన్నారని చెప్పారు.
మార్గదర్శిలో చిట్స్ కడుతున్నట్లు సుమారు మూడు వేల మందికి ఆ విషయమే తెలియదని ఆయన వెల్లడించారు. ఘోస్ట్ చందాదారుల పేరుతో కొన్ని చిట్స్ లలో కంపెనీయే డబ్బు తీసుకొంటుందని తెలిపారు. అయితే అసలు ఏమీ అక్రమాలు జరగడం లేదంటూ, తమకు అనుకూలంగా ఈనాడులో వార్తలు వ్రాసుకొంటున్నారని ఆయన ఆరోపించారు.
సిఐడి అడిషనల్ డిజిపి మాట్లాడుతూ.. ‘ అన్ని రూల్స్ పాటిస్తున్నామని చెబుతూ మోసం చేస్తున్నారు. ఆక్షన్ జరపకుండా నెలలపాటు పొడిగిస్తున్నారు. 40 శాతం చిట్ గ్రూపుల్లో చందాదారులే లేరు. కంపెనీనే సొంతంగా చిట్స్‌ను తీసుకుంటుంది ‘ అని వివరించారు.
