నాగార్జునసాగర్ ఆయకట్టు పరిధిలో రైతులు వరి సాగు చేయవద్దని రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు హెచ్చరించారు. వర్షాభావం కారణంగా ఆయకట్టు పరిధిలోని పంటలకు సాగునీరు అందించలేమని తేల్చి చెప్పారు. సాగర్ కుడి, ఎడమ కాల్వల పరిధిలో ఉన్న ఆయకట్టుకు ఈ ఏడాది నీరు విడుదల కాలేదు. జలాశయాల్లోకి నీరు వచ్చే పరిస్థితి లేకపోవడంతో రైతులు ఈ సీజన్లో వరి వేయవద్దని కోరారు.
వాటి స్థానంలో ఆరుతడి పంటలు వేసుకోవాలని పేర్కొంటూ సాగర్లో నీటిమట్టం తక్కువగా ఉన్నందున సాగునీరు రోజువారీగా విడుదల చేయడం కుదరదని స్పష్టం చేశారు. అవసరాలకు అనుగుణంగా వారబందీని అమలు చేస్తామని పేర్కొన్నారు. వర్షాలు సమృద్ధిగా పడితే వారబందీని రద్దు చేస్తామని వెల్లడించారు.
ఈ ఏడాది ఎన్నడూ లేని విధంగా ఆగస్టులో తక్కువ వర్షపాతం నమోదు కావడంతో రైతులు ఉన్న నీటిని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి అంబటి కోరారు. కృష్ణా పరివాహక ప్రాంతాల్లో ఎగువ నుంచి నీటి ప్రవాహం లేకపోవడంతో తెలుగు రాష్ట్రాల్లోని జలాశయాల్లోకి నీరు రావడం లేదు. ఏపీలో వర్షాలు కురవకపోవడంతో నాలుగేళ్ల తర్వాత తొలిసారి పట్టిసీమ లిఫ్ట్ ద్వారా గోదావరి నీటిని కృష్ణా డెల్టాకు తరలిస్తున్నారు.
రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక నాలుగేళ్లుగా గోదావరి జలాల అవసరం రాలేదు. ఎగువ రాష్ట్రాల్లో సమృద్ధిగా వర్షాలు కురవడంతో గత ఏడాది జూన్ ప్రారంభం నాటికి జలాశయాల పూర్తి నీటితో నిండాయి. దీంతో ఖరీఫ్, రబీ సీజన్లకు ఎలాంటి ఇబ్బంది రాలేదు. ఈ ఏడాది కర్ణాటకలో సైతం పెద్దగా వర్షాలు లేకపోవడంతో ఇబ్బందులు తప్పలేదు.
మరోవైపు రాష్ట్రంలో వర్షాలు కూడా అంతంత మాత్రంగా ఉండటంతో సాగర్ ఆయకట్టుపై ఆంక్షలు తప్పడం లేదు. తగినన్ని నీళ్లు లేకపోవడంతోనే వరి సాగుకు నీరు ఇవ్వలేమని, ఆరుతడి పంటలకు మాత్రమే నీటిని సరఫరా చేస్తామని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ప్రకటించారు.
నాలుగు జిల్లాల పరిధిలో కుడి కాలువ కింద 11.17 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. దీనిలో 4,79,950 ఎకరాలు మగాణి, 6,81,687 ఎకరాల మెట్ట భూమి ఉంది. వారబందీ విధానంలో కుడి కాలువకు నీటిని సరఫరా చేసేందుకు జలవనరుల శాఖ ప్రణాళిక రూపొందించింది.
ఇప్పటికే వరినారు మళ్లు పోసి, నీరు విడుదల చేయగానే నాట్లు వేసుకోవచ్చన్న ఆశతో ఉన్న రైతులు ప్రభుత్వ ప్రకటనతో తీవ్ర నిరాశకు గురయ్యారు. సాగర్ జలాశయంలో 312.5 టీఎంసీలకుగాను ప్రస్తుతం 156.67 టీఎంసీల నీటి నిల్వ ఉంది.