సర్దార్ వల్లభాయ్ పటేల్ వల్లే తెలంగాణకు విముక్తి లభించిందని, సర్దార్ పటేల్ లేకపోతే తెలంగాణకు విముక్తి లభించేది కాదని కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. సర్దార్ పటేల్, మున్షీ వల్లే నిజాం పాలన అంతమైందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో తెలంగాణ విమోచన దినోత్సవం ఘనంగా నిర్వహించారు.
ఈ వేడుకల్లో పాల్గొన్న కేంద్ర హోంమంత్రి అమిత్షా ముందుగా అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి భద్రతా బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో అమిత్ షా మాట్లాడుతూ “తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు. రజాకర్లపై పోరాడిన యోధులకు నివాళులు. సర్దార్ పటేల్ లేకపోతే తెలంగాణకు ఇంత త్వరగా విముక్తి లభించేది కాదు. పటేల్, మున్షీ వల్లే నిజాం పాలన అంతమైంది” అని తెలిపారు.
“నిజాంను పాలనను అంతం చేసే క్రమంలో ఎందరో మహానుభావులు ప్రాణత్యాగాలు చేశారు. రావి నారాయణరెడ్డి, కాళోజీ నారాయణరావు, బద్దం ఎల్లారెడ్డి, బూర్గుల రామకృష్ణారావు, నరసింహారావుకు నా నివాళులర్పిస్తున్నా. ఆపరేషన్ పోలో పేరుతో నిజాం మెడలు పటేల్ వంచారు. రక్తం చిందకుండా నిజాం రజాకారులు లొంగిపోయేలా చేశారు” అంటూ కొనియాడారు.
సెప్టెంబర్ 17ను విమోచన దినోత్సవంగా అధికారికంగా నిర్వహించటానికి కారణాలు ఉన్నాయని చెబుతూ భవిష్యత్ తరాలకు నాటి పోరాట యోధులను గుర్తు చేయటం, పోరాట యోధులను సన్మానించటం కోసమే జరుపుకుంటున్నామని తెలిపారు. అయితే, ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే కొందరు విమోచన దినోత్సవాన్ని వ్యతిరేకిస్తున్నారని అమిత్ షా ధ్వజమెత్తారు.
తెలంగాణ ఏర్పడ్డాక కూడా విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించలేదని చెబుతూ విమోచనంపై రాజకీయం చేసేవారిని ప్రజలు క్షమించరని అమిత్ షా హెచ్చరించారు. తెలంగాణ చరిత్రను కొందరు వక్రీకరించారని, నరేంద్రమోదీ ప్రధాని అయ్యాకే ఆ పొరపాటును చెప్పారు.
9 ఏళ్ల మోదీ పాలనలో కేంద్ర ప్రభుత్వం భారత్ సత్తా ఏంటో ప్రపంచానికి చాటిచెప్పామని చెబుతూ చంద్రయాన్ 3 ప్రయోగం, జీ20 సదస్సు విజయవంతం అయిందని గుర్తుచేశారు. గతంలో చరిత్రను వక్రీకరించారని, కాంగ్రెస్ చేసిన తప్పులను మోదీ సరిద్దారని తెలిపారు. మోదీ పుట్టినరోజు నాడు సేవా దివస్ గా జరుపుకుంటున్నామని తెలిపారు. స్వాతంత్య్ర పోరాటాన్ని కూడా కాంగ్రెస్ వక్రీకరించిందని అమిత్ షా మండిపడ్డారు. భవిష్యత్ తరాలకు తెలంగాణ విమోచన చరిత్ర తెలియాలని స్పష్టం చేశారు. అనంతరం దివ్యాంగులకు ప్రత్యేక ట్రై సెకిళ్లు అందించారు.
కాగా తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు సందర్భంగా పరేడ్ గ్రౌండ్లో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయం ఉట్టిపడేలా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. సాంస్కృతిక కళారూపాలు, బతుకమ్మ, బోనాలు, పోతరాజు విన్యాసాలు, సన్నాయి, డప్పు, వొగ్గు డోలు, కోలాటం, గుస్సాడి నృత్యం, చిడుతలు, తదితర తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర కళారూపాలు , సాంస్కృతిక కార్యక్రమాలు కేంద్రం ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రదర్శించారు.