తెలంగాణ వ్యాప్తంగా వచ్చే రెండు రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అంచనా వేసింది. పశ్చిమ దిశ నుంచి రాష్ట్రం వైపు గాలులు వీస్తున్నాయని చెప్పింది. అదే సమయంలో పగటి పూట ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 3.1 డిగ్రీల అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది.
కాగా, తిరోగమన సమయం దగ్గరపడటంతో నైరుతి రుతుపవనాలు పుంజుకుంటున్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. గురువారం నుంచి ఈ నెలాఖరు వరకు నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతాయని పేర్కొంది. దీంతో అక్టోబర్ మొదటి వారం వరకు దేశంలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు పడతాయని వెల్లడించింది.
సెప్టెంబర్ 21న తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని.. దీని ప్రభావంతో సెప్టెంబర్ 22 నుంచి 28 వరకు సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని తెలిపింది. అలాగే అక్టోబర్ 5, 6వ తేదీల్లో కూడా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అక్టోబర్ 6 నుంచి 12వ తేదీ మధ్యలో నైరుతి రుతుపవనాలు ఉపసంహరించుకునే అవకాశం ఉందని చెప్పింది.
రుతుపవనాలు పుంజుకోవడంతో దేశంలోని పలు రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయని ఐఎండీ అధికారులు అంచనా వేశారు. ఈ క్రమంలో ఆయా రాష్ట్రాలకు ఎల్లో, రెడ్ అలర్ట్‌లను జారీ చేశారు. పశ్చిమ మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కారణంగా రాగల రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయని పేర్కొన్నారు.
తూర్పు రాజస్థాన్, పశ్చిమ మధ్యప్రదేశ్, గుజరాత్, తమిళనాడు, పుదుచ్చేరిలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పారు. ఇక ఏపీలోనూ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఉత్తర అండమాన్ సముద్రంలో ఉన్న ఉపరితల ఆవర్తనం మంగళవారం బలపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని చెప్పారు. దీని ప్రభావంతో మరో 24 గంటల్లో కోస్తాలో పలుచోట్ల రాయలసీమలో ఉరుములు, పిడుగులతో భారీ వర్షాలు కురుస్తాయని వివరించారు.