ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. స్కిల్ కేసులో క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో చంద్రబాబు తరఫు న్యాయవాదులు పిటిషన్ వేశారు. తనపై ఏసీబీ కోర్టు ఇచ్చిన రిమాండ్‌ను క్వాష్ చేయాలని పిటిషన్లో చంద్రబాబు కోరారు.
సోమవారం ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి ఎదుట ప్రత్యేకంగా మెన్షన్ చేసి, వెంటనే విచారణ చేపట్టాలని కోరే అవకాశం ఉందని తెలుస్తోంది. దర్యాప్తు తుది దశలో ఉన్నందున కేసులో జోక్యం చేసుకోలేమంటూ చంద్రబాబు క్వాష్ పిటిషన్‌ను శుక్రవారం ఏపీ హైకోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే.
చంద్రబాబు సీఐడీ తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్, విజయవాడ ఏసీబీ కోర్టు తనకు జ్యుడిషియల్ రిమాండు విధిస్తూ జారీచేసిన ఉత్తర్వులను కొట్టేయాలని కోరుతూ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే, చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. భజన్‌లాల్ కేసు మొదలు నిహారిక ఇన్ఫ్రా కేసు వరకూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను పరిగణనలోకి తీసుకుంటే సీఆర్పీసీ సెక్షన్ 482 (క్వాష్) ప్రకారం ప్రస్తుత కేసులో ఈ దశలో జోక్యం చేసుకోలేమని పేర్కొంది.
ఈ కేసుకు చెందిన వాస్తవాల విషయంలో ఇరువైపుల సీనియర్ లాయర్లు లేవనెత్తిన అంశాలపై సెక్షన్ 482 కింద హైకోర్టు మినీ ట్రైల్ నిర్వహించడానికి వీల్లేదని పేర్కొంది. ఈ కేసు 2021 డిసెంబరు 9న నమోదైందని, దర్యాప్తు సంస్థ 140 మందికి పైగా సాక్షులను విచారించి, 4వేలకు పైబడి దస్త్రాలను సేకరించిందని తీర్పులో ప్రస్తావించారు.
నిధుల దుర్వినియోగం వ్యవహారం అస్పష్టమైనదని, దాన్ని తేల్చేందుకు అత్యంత నిపుణులతో కూడిన దర్యాప్తు అవసరం అని ప్రస్తావించారు. దర్యాప్తు తుది దశలో ఉన్న ఈ సమయంలో ఎఫ్‌ఐఆర్‌లోను, జ్యుడిషియల్ రిమాండు ఇస్తూ ఏసీబీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లోను జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. క్వాష్ పిటిషన్‌ను కొట్టేస్తున్నట్లు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.శ్రీనివాసరెడ్డి తీర్పు ఇచ్చారు.