పార్లమెంట్ ఆమోదించిన మహిళా రిజర్వేషన్ బిల్లు అమలులోకి వచ్చేందుకు ఇంకా వ్యవధి ఉన్నప్పటికీ రాజకీయ పార్టీలు వచ్చే ఎన్నికలలో మహిళలకు తగు ప్రాతినిధ్యం ఇవ్వక తప్పని పరిస్థితులు ఏర్పడుతున్నది. చివరకు, ఇన్ని రోజులు కేవలం పురుషాధిక్య పార్టీ అని పడిన ముద్రను చెరిపేసుకునేందుకు, ముస్లిం మహిళా ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు ఎంఐఎం చరిత్రలో తొలిసారిగా ఓ ముస్లిం నాయకురాలిని రంగంలోకి దించేందుకు సిద్ధమైంది.
ఇందుకోసం మళ్లీ ఓవైసీ కుటుంభం నుంచే ఓ మహిళ నేత రాజకీయ ప్రవేశంపై రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ కూతురు ఫాతిమా ఓవైసీ వచ్చే ఎన్నికలలో పోటీకి సన్నాహాలు జరుగుతున్నాయి. రెండు రోజుల క్రితం ఓ కార్యక్రమంలో పాల్గొన్న అక్బరుద్దీన్ తన కూతురు లండన్లో బారిస్టర్ చదువుతోందని, త్వరలోనే హైదరాబాద్ వచ్చేసి ప్రజాసేవలో భాగమవుతుందంటూ సంచలన ప్రకటన చేశారు.
ఇప్పటికే హైదరాబాద్లోని పాత బస్తీలో ఎంఐఎం పార్టీకి మంచి ఆదరణే ఉన్నప్పటికీ ఇప్పటి వరకు ఆ పార్టీ నుండి మహిళా అభ్యర్థులు లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలలో పోటీచేయలేదు. ఫాతిమా ఓవైసీని రాజకీయాల్లో తీసుకు రావడం ద్వారా ఎంఐఎంలోనూ మహిళలను ప్రాధాన్యత ఇస్తున్నామనే సందేశాన్ని ఇచ్చే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తున్నది.
కాగా, లోక్ సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలోనూ వ్యతిరేకంగా ఓటు వేసిన ఇద్దరు ఎంపీలు ఎంఐఎం పార్టీ వాళ్లే కావటం గమనార్హం. దీంతో మహిళా ఓటర్లకు తప్పుడు సంకేతాలు వెళ్లాయని భావిస్తున్న ఎంఐఎం వెంటనే అక్బరుద్దీన్ కూతురు రాజకీయ ప్రవేశం గురించి ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు.
ఆమె ప్రవేశంతో ఎంఐఎంలో ముస్లిం మహిళలకు కూడా ఓ వాయిస్ ఉంటుందని, ముస్లిం మహిళలకు ఎలాంటి సమస్య ఉన్నా ఎంఐఎం పార్టీ ఆఫీస్ తలపు తట్టేలా, వారికి భరోసా కల్పించేందుకు చేయవచ్చని ఎంఐఎం వ్యూహంగా వెల్లడవుతుంది. అయితే ఆమెను అసెంబ్లీ ఎన్నికలలో నిలబెడతారా? నిలబెడితే పాత బస్తీ నుండే నిలబెడతారా? లేదా తెలంగాణాలో మరేదైనా స్థానం నుండి పోటీ చేయిస్తారా? అనే విషయాలు తెలియాల్సి ఉన్నాయి.
పాత బస్తిలోని ఏదో ఒక నియోజకవర్గంతో పాటు బోధన్, నిజామాబాద్ అర్బన్ లాంటి స్థానల్లో ముస్లిం ఓటర్లు అధికంగా ఉండటంతో వాటిల్లో ఎక్కడి నుంచైనా పోటీకి దింపే అవకాశాలు ఉన్నాయి.