టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్ కి భారీ షాక్ తగిలింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల్లో పోటీ చేయకుండా మహమ్మద్ అజారుద్దీన్‌పై అనర్హత వేటు పడింది. ఈ మేరకు జస్టిస్ లావు నాగేశ్వరరావు కమిటీ అతనిపై అనర్హత వేటు వేసింది. హెచ్‌సీఏ ఓటరు జాబితా నుంచి అజారుద్దీన్ పేరును తొలగిస్తూ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది.
గతంలో ఏకకాలంలో హెచ్‌సీఏ, డెక్కన్ బ్లూస్ క్లబ్ అధ్యక్షుడిగా అజార్ వ్యవహరించారు. హెచ్‌సీఏ అధ్యక్షుడిగా నిబంధనలు ఉల్లంఘించారంటూ కమిటీ అతనిపై అనర్హత వేటు వేసింది. ఇప్పటికే హెచ్‌సీఏ ఎన్నికల నోటిఫికేషన్ గత నెల 30న విడుదలైంది. హెచ్‌సీఏ ఎన్నికల అధికారి వీఎస్ సంపత్ నోటిఫికేషన్ జారీ చేశారు.
హెచ్‌సీఏ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కార్యదర్శి, సహాయ కార్యదర్శి, కోశాధికారి, ఈసీ పోస్టులకు అక్టోబర్ 11 నుంచి 13 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 14న నామినేషన్లను పరిశీలించనున్నారు. అక్టోబర్ 16వ తేదీ లోపు నామినేషన్లు ఉపసంహరించుకునేందుకు అవకాశం కల్పించారు. 20న పోలింగ్ నిర్వహించి అదే రోజు సాయంత్రం ఫలితాలు వెల్లడించనున్నారు.
హెచ్‌సీఏ ప్రెసిడెంట్ తో పాటు వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, ట్రెజరర్, ఈసీ సభ్యులను దీని ద్వారా ఎన్నుకుంటారు. హెచ్‌సీఏకు మాజీ జస్టిస్ లావు నాగేశ్వర్ నేతృత్వంలో ఏకసభ్య కమిటీని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది. ఇప్పటివరకు జస్టిస్ లావు నాగేశ్వరరావు చేతిలోనే హెచ్‌సీఏ బాధ్యతలు ఉన్నాయి.
హెచ్‌సీఏ అధ్యక్షుడిగా అజారుద్దీన్ పదవీ కాలం గతంలోనే ముగిసింది. అజహరుద్దీన్, ఇతర కార్యవర్గ సభ్యుల మధ్య విభేదాలు ఉన్న సంగతి తెలిసిందే. హెచ్‌సీఏకు సంబంధించి పలు కేసులు కోర్టుల్లో ఉన్నాయి. దీనిపై పలుమార్లు విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఈ గందరగోళాన్ని తొలగించేందుకు ఎన్నికలు నిర్వహించడమే సరైన మార్గమని ఇటీవల అభిప్రాయం వ్యక్తం చేసింది.
దీంతో నోటిఫికేషన్ జారీ చేసినట్లు సమాచారం. సుప్రీం కోర్టు హెచ్‌సీఏ రోజువారీ కార్యకలాపాల నిర్వహణ, ఎన్నికల పర్యవేక్షణ బాధ్యతలను.. మాజీ న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావుకు అప్పగించింది.
