తెలంగాణ మంత్రులు ఇటీవల కాలంలో వరుసగా వార్తల్లో నిలుస్తున్నారు. ఇతరులపై చేయి చేసుకుంటూ రాష్ట్ర మంత్రులు తరచూ వివాదాలు కొని తెచ్చుకుంటున్నారు. ఇటీవలే మంత్రి తలసాని శ్రీనివాస్ ఇందిరాపార్క్ స్టీల్ బ్రిడ్జి ఓపెనింగ్ సమయంలో మంత్రి కేటీఆర్ పక్కన నడుస్తున్న బైంసా అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ జాదవ్ రాజేష్‌ను వెనక్కి లాగి మరి చెంప దెబ్బ కొట్టారు.
ఈ ఘటన మరువక ముందే అధికార బీఆర్ఎస్లోని మరో మంత్రి వివాదంలో చిక్కుకున్నారు.తాజాగా హోంమంత్రి మహమూద్ అలీ తన గన్‌మెన్ చెంపపై కొట్టారు. మంత్రి తలసాని పుట్టినరోజు సందర్భంగా ఆయనను ఆలింగనం చేసుకుని విషెస్ చెప్పారు. అంతలోనే బొకే ఎక్కడ? అంటూ పక్కనే ఉన్న గన్‌మెన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
సహనం కోల్పోయినహోంమంత్రి గన్‌మెన్‌పై చేయి చేసుకున్నారు. ఆయనను తలసాని వద్దులేండి అంటూ వారించారు. హోంమంత్రి మహమూద్ అలీ తీరుపై నెటిజన్లు తీవ్ర విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. ఇంత చిన్న కారణానికే గన్‌మెన్‌ను కొట్టాలా అంటూ హోంమంత్రి మహమూద్ అలీపై మండిపడుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
హోం శాఖ మంత్రి మహమూద్ ఆలీ పై ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ నాయకుడు బక్క జడ్సన్ ఫిర్యాదు చేశారు. డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్‌పై చేయి చేసుకున్న హోం మంత్రి మహమూద్ ఆలీపై సెక్షన్ 351, 350 కింద చట్ట రీత్యా చర్యలు తీసుకోవాలని ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులో పేర్కొన్నారు.