అక్టోబర్ 15 నుంచి 23 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో శుక్రవారం డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల కారణంగా అక్టోబరు 15 నుండి 23వ తేదీ వరకు అష్టదళపాదపద్మారాధన, తిరుప్పావడ, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, సహస్రదీపాలంకరణ సేవలు రద్దయ్యాయని చెప్పారు.
ముందస్తుగా ఆర్జిత బ్రహ్మోత్సవం సేవాటికెట్లు బుక్ చేసుకున్న గృహస్తులను వారికి సూచించిన వాహనసేవలకు మాత్రమే అనుమతించడం జరుగుతుందని స్పష్టం చేశారు. వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులు తదితర ప్రివిలేజ్డ్ దర్శనాలు కూడా రద్దు చేశారు. భక్తుల భద్రత దృష్ట్యా అక్టోబరు 19న గరుడసేవ నాడు ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాల రాకపోకలను రద్దు చేశారు.
బ్రహ్మోత్సవాల మరుసటిరోజైన అక్టోబరు 24న పార్వేట ఉత్సవం జరుగునుంది. అక్టోబరు 19న గరుడసేవ సందర్భంగా అక్టోబరు 17 నుండి 19వ తేదీ వరకు కాటేజి దాతలకు గదుల కేటాయింపు ఉండదు. బ్రహ్మోత్సవాల మిగతా రోజుల్లో యధావిధిగా ఉంటుంది.
సెప్టెంబరు 18 నుంచి అక్టోబరు 17వ తేదీ వరకు పెరటాసి మాసం కారణంగా గత శుక్ర, శని, ఆది, సోమవారాల్లో అనూహ్యంగా భక్తులు తరలివచ్చారు. టీటీడీ, విజిలెన్స్ సిబ్బంది, శ్రీవారి సేవకులు, టీటీడీ విద్యాసంస్థలకు చెందిన ఎన్సిసి, ఎన్ఎస్ఎస్ విద్యార్థులు కలిసి భక్తులకు విశేషంగా సేవలందించారు.
రాబోయే పెరటాసి రద్దీని దృష్టిలో ఉంచుకుని భక్తులకు విస్తృతంగా సేవలందించేందుకు చర్యలు తీసుకున్నామని ధర్మారెడ్డి తెలిపారు. పెరటాసి శనివారాలు, వరుస సెలవుల కారణంగా ఆధిక రద్దీ దృష్ట్యా, ఎస్ఎస్డి టోకెన్ల జారీని రద్దు చేశారు. తిరుపతిలో అక్టోబర్ 6, 7, 8, 13, 14, 15వ తేదీలలో ఎస్ఎస్డి టోకెన్లు జారీ చేయబడవని వెల్లడించారు. భక్తులు నేరుగా తిరుమలకు వచ్చి సర్వదర్శనానికి వెళ్లవచ్చని చెప్పారు.