కరడుగట్టిన ఆంక్షల అత్యధిక సంఖ్యాక నిరుపేదల దేశం అఫ్ఘనిస్థాన్‌ను పెను భూకంపం కకావికలం చేసింది. కనీసం 2000 మంది భూకంప తాకిడితో మృతి చెందారు. ఇప్పటికీ లెక్కలేనంత మంది క్షతగాత్రులై అందని సాయం కోసం ఎదురుచూస్తున్నారు. పశ్చిమ అఫ్ఘనిస్థాన్‌లోని హెరాత్ భూకంప ప్రధాన కేంద్రంగా మారింది.
శనివారం తలెత్తిన తీవ్రస్థాయి భూకంపం, తరువాతి అంతే సామర్థపు శక్తివంతపు అనంతర ప్రకంపనలతో ఇప్పుడు అఫ్ఘన్ హృదయవిదారక ఛిద్ర చిత్రితం, రక్తసిక్తం అయింది. ఇప్పటి వరకు మృతుల సంఖ్య తమకు అందిన సమాచారం మేరకు రెండువేల వరకూ ఉంటుందని ఒక్కరోజు తరువాత ఆదివారం తాలిబన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి ఒక్కరు చెప్పారు.
రెండు దశాబ్దాల కాలంలో ఇప్పుడు సంభవించిన భూకంపం అత్యంత భయానకం, తీవ్రస్థాయిదని అధికారులు తెలిపారు. ఆదివారం వెలువరించిన ప్రకటన మేరకు మొత్తం మీద మృతుల సంఖ్య 2060. కాగా గాయపడ్డ వారిసంఖ్య 1240, నేలమట్టం అయిన నివాసాలు 1320. గాయపడ్డ వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య ఏ స్థాయికి చేరుతుందో అనే ఆందోళన వ్యక్తం అయింది.
ఈ ప్రాంతంలోని హెరాన్ సిటీకి వాయవ్యంగా కేవలం 40 కిలోమీటర్ల దూరంలోనే భూకంప ప్రధాన కేంద్రం ఉందని అమెరికాకు చెందిన భూకంపాల పరిశోధనా సంస్థ (యుఎస్‌జిఎస్) తెలిపింది. రెక్టర్ స్కేలుపై తొలుత 6.3 తీవ్రతతో మొదటి రెండు భూకంపాలు సంభవించాయి.
తరువాత వరుసగా మూడు తీవ్రస్థాయి భూ ప్రకంపనలు 6.3, 5.9, 5.5 తీవ్రతతో ఆటుపోట్లను సృష్టించాయి. ఇదే క్రమంలో పలు మార్లు స్వల్ప ప్రకంపనలు కూడా రావడంతో జనం ఎటు కదలలేని దిక్కుతోచని స్థితిలో గంటల తరబడి కొట్టుమిట్టాల్సి వచ్చింది.
భూకంపంలో వేలాది మంది చనిపోగా, మిగిలిన వారు ఇక్కడి దారుణ పరిస్థితుల నడుమ, ఎంతకూ అందని సాయం మధ్య నరకం చవిచూస్తున్నారు. కుప్పకూలిన రాళ్ల, మట్టి ఇటుకల ఇళ్ల శిథిలాల మధ్య చిక్కుపడి ఉన్న తమ వారి మృతదేహాలను బతికి ఉన్న బంధువులు అతికష్టం మీద వెలికి తీస్తున్నారు.
ఇప్పటికీ భూకంప తాకిడి ప్రాంతాలలో డజన్ వరకూ సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. సహాయక చర్యలను చేపట్టాయి. సైన్యం, రెడ్ క్రిసెంట్ వంటి స్వచ్ఛంద సంస్థలు ప్రజలను ఆదుకునేందుకు యత్నిస్తున్నాయి. ఐరాసకు చెందిన మైగ్రేషన్ సంస్థ అంబులెన్స్‌లు, వైద్య బృందాలను తరలించింది.
ప్రాంతీయ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న వారి వద్దకు వెళ్లి వారికి మానసిక స్థయిర్యం కల్పించేందుకు సైకోసోషల్ కార్యకర్తలు కూడా వచ్చారు. పూర్తిగా దెబ్బతిన జెండా జన్ జిల్లాకు కనీసం మూడు సంచార ఆరోగ్య బృందాలు తరలివచ్చాయి. హెరాత్‌లో ఇప్పుడు పలు దేశాలకు చెందిన డాక్టర్లతో కూడిన బృందాలు కొన్ని తాత్కాలిక వైద్య కేంద్రాల శిబిరాలను ఏర్పాటు చేసి సేవలను అందిస్తున్నాయి.