తెలంగాణలో ఎలాగైనా ఈసారి బీఆర్ఎస్ను బొంద పెట్టాలని ఆదిలాబాద్ జనగర్జన సభలో పిలుపునిచ్చిన బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ను ఈసారి ఎన్నికల్లో తానే ఓడిస్తానని శపథం చేశారు. జరగబోయే ఎన్నికల్లో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూరాబాద్ నియోజకవర్గంతో పాటు గజ్వేల్లో కూడా పోటీ చేస్తానని ప్రకటించారు.
తాను 6అడుగులు లేకపోవచ్చు, రాజకీయ నేపధ్యంలో ఉన్న కుటుంబం నుంచి రాకపోవచ్చు కానీ..ప్రజల బాధలు తీర్చేవాడినని..కచ్చితంగా బీఆర్ఎస్ని గద్దె దింపడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో పార్టీ శ్రేణుల సమావేశంలో మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ మీద పోటీ చేస్తానని చెప్పారు.
హుజూరాబాద్ నియోజకవర్గంతో అక్కడ కూడా పోటీలో నిలబడతానని స్పష్టం చేశారు. కొత్త రాష్ట్రంలో మంచి రాజకీయ వాతావరణాన్ని పాడు చేసిన దుర్మార్గపు పార్టీ భారత రాష్ట్ర సమితి అని ఘాటు విమర్శలు చేశారు ఈటల రాజేందర్. మీరు తలుచుకుంటే వేరే వాళ్ళకి డిపాజిట్లు కూడా రావని హుజురాబాద్ నియోజకవర్గ ఓటర్లను ఉద్దేశించి అన్నారు. పోలింగ్ జరిగే ఈ 40-50 రోజులు మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకునే బాధ్యత నాది అంటూ హామీ ఇచ్చారు బీజేపీ ఎమ్మెల్యే.
ఏ పోలీస్ ఆఫీసర్ అయినా మిమ్మల్ని బెదిరిస్తే చమడాలు తీస్తారు జాగ్రత్త అని చెప్పండి. పిచ్చి పనులు చేసినా.. పక్షపాతంతో వ్యవహరించినా.. వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఘాటుగా హెచ్చరికలు చేశారు. మా వాళ్ల మీద చెయ్యి పడ్డ మీ అంతు ఏందో చూసే వరకు వదిలిపెట్టనంటూ అధికార పార్టీ నేతలతో పాటు అధికారులకు వార్నింగ్ ఇచ్చారు.
ఫైనల్గా ఎదురుదాడి చేయడం కొట్టడం చేతకాక కాదు కార్యకర్తలు కేసుల చుట్టూ తిరగాల్సి వస్తుందని ఆగానని చెప్పారు ఈటల. కొట్లాట తన సంస్కృతి కాదని ఎందుకంటే తాను రాజకీయ నాయకుడిని కాని గుండానో, రౌడీనో కాదని స్పష్టం చేశారు. కొంతమంది చిల్లర గాళళ్లు తనను కేసీఆర్ కోవర్ట్ అని మాట్లాడుతున్నారని , అలాంటివి విన్నప్పుడు తనకు ఎంత బాధ ఉంటుందో అర్ధం చేసుకోవాలని సూచించారు.
తాను కేసీఆర్ వల్ల నరకం అంటే ఏందో భూలోకంలోనే సంపూర్ణంగా అనుభవించిన వాడినని అందుకే నా వేడి నా శక్తిని కేసీఆర్ ఓటమికి వినియోగిస్తానని చెప్పారు. ఈనెల 16 వ తేదీ భారత రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ హుజురాబాద్ రాబోతున్న నేపధ్యంలో ఆయన సభను విజయవంతం చేయాలని స్థానిక ప్రజలకు, తన క్యాడర్ని కోరారు.