తెలంగాణ ఎన్నికలలో అధికారం తమదే అంటూ ధీమాతో ఉన్న కాంగ్రెస్ కు అనుకోని దెబ్బ తగిలింది. తెలంగాణ రాష్ట్ర తొలి పిసిసి అధ్యక్షుడు, మాజీ మంత్రి, సీనియర్ పార్టీ నేత పొన్నాల లక్ష్మయ్య శుక్రవారం పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకు.. పొన్నాల లక్ష్మయ్య పంపించారు.
ఈ సందర్బంగా తన గోడును వెళ్లబోసుకున్నారు. దీంతోపాటు కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్‌కు కూడా తన రాజీనామా విషయాన్ని చెప్పినట్లు తెలుస్తోంది. త్వరలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ స్వయంగా పొన్నాల ఇంటికి వెళ్లి ఆయన్ను పార్టీ చేరాల్సిందిగా ఆహ్వానిస్తారని తెలుస్తోంది.
కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా ఉన్న పొన్నాల లక్ష్మయ్య 2014 లో తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలి పీసీసీ అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. అయితే తన సొంత నియోజకవర్గం జనగామలో 2014, 2018 లో వరుసగా రెండు సార్లు ఓటమి పాలయ్యారు.
2014లో తానే పార్టీ తరఫున పోటీ చేసేవారికి భీఫామ్‌లు అందించిన పొన్నాల లక్ష్మయ్యకు.. 2018లో మాత్రం అంత సులువుగా టికెట్ లభించలేదు. దీంతో ఢిల్లీకి వెళ్లిన పొన్నాల తన పలుకుబడిని ఉపయోగించి చివరి నిమిషంలో జనగామ టికెట్ దక్కించుకున్నారు. అయితే ఆ ఎన్నికల్లోనూ పొన్నాల ఓటమి పాలయ్యారు.
జనగామ నియోజకవర్గంలో అధికార పార్టీకి చెందిన ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిపై వ్యతిరేకత ఉన్నా ఓటర్లను తనవైపు తిప్పుకోవడంలో ఆయన విఫలమయ్యారు. దీంతో మరోసారి టికెట్ ఇచ్చినా పొన్నాల లక్ష్మయ్య గెలవలేడని భావించిన అధిష్ఠానం టికెట్ నిరాకరించినట్లు తెలుస్తోంది.
బీసీలకు టికెట్లు కేటాయించడంలో కాంగ్రెస్ పార్టీ చిన్నచూపు చూస్తోందని పొన్నాల లక్ష్మయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ బీసీ నేతలు ఇటీవల బహిరంగంగానే తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. తన సామాజిక వర్గానికే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని బహిరంగంగా ఆరోపించారు.
బీసీ నేతలంతా కలిసి పలు సమావేశాలు కూడా నిర్వహించారు. ఈ క్రమంలోనే ఢిల్లీకి కూడా వెళ్లిన పొన్నాల టికెట్ కోసం ప్రయత్నాలు చేశారు. అధిష్టానం నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో.. టికెట్ రాదని నిర్ధారించుకున్న పొన్నాల పార్టీకి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.