ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి వచ్చే నెల ఎన్నికలు జరుగనున్న తరుణంలో కరోనా మహమ్మారి మరోసారి పడగ విప్పడంలో రాజకీయ నాయకులు ఖంగారు పడుతున్నారు. ఎన్నికల ప్రచారంకు వెళ్ళడానికి జంకుతున్నారు. కరోనా ప్రమాదం దృష్ట్యా ఎన్నికలను రెండు, మూడు నెలలపాటు వాయిదా వేయాలని అలాహాబాద్ ఎన్నికల కమీషన్ గతనెలలోనే సూచించడం గమనార్హం.
అయితే, ఎన్నికల కమీషన్ ముందు కరోనా నిబంధనలు పాటిస్తూ షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరపాలని అన్ని రాజకీయ పార్టీలు కోరాయి. దానితో యధావిధిగా ఎన్నికలు జరుపుతున్నట్లు కమీషన్ ప్రకటించింది. కానీ ఇప్పుడు ఎన్నికలపై కరోనా ప్రభావం పడినట్లే కనిపిస్తోంది. ముఖ్యంగా బిజెపి, కాంగ్రెస్ నాయకులు తమ ఎన్నికల పర్యటన కార్యక్రమాలను వాయిదా వేసుకొంటున్నారు.
మహమ్మారి కారణంగా యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నోయిడా ర్యాలీని రద్దు చేసుకున్నారు. నోయిడాలో గురువారం ముఖ్యమంత్రి ప్రచారం చేపట్టాల్సి ఉండగా అక్కడ కరోనా కేసులు రికార్డుస్థాయిలో పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అటు కాంగ్రెస్ కూడా వారి ప్రచార ర్యాలీలు రద్దుచేసుకుంది.
లడ్కీ మారథాన్ పేరిట నిర్వహిస్తున్న కార్యక్రమాలను కూడా కాంగ్రెస్ రద్దు చేసింది. అలాగే ఉత్తరప్రదేశ్లో ప్రచార ర్యాలీలపై నిషేధం విధించాలంటూ ఎన్నికల కమీషన్ కు యూపీ కాంగ్రెస్ లేఖ రాసింది . కరోనా థర్డ్ వేవ్ నేపథ్యంలో ప్రచారసభలు బ్యాన్ చేయాలని విజ్ఞప్తిచేసింది.
యూపీలోని బరేలీ జిల్లా నుంచి మంగళవారం కొన్ని దిగ్భ్రాంతికరమైన ఘటనలు చోటు చేసుకోవడంతో పార్టీలు ఈ నిర్ణయాన్ని తీసుకున్నాయి. కాగా ఓ పార్టీ కార్యక్రమానికి హాజరైన వందలాది మంది మహిళలు, యువకులు ముసుగులు లేకుండా బహిరంగంగా కార్యక్రమంలో లోపల, వెలుపల కనిపించారు.
వైరస్ విజృంభిస్తున్న సమయంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు సభలను, ర్యాలీలను పార్టీలు రద్దు చేసుకున్నాయి. బుధవారం నాటికి దేశంలో కొత్తగా నిర్థారణ అయిన వాటితో కలిపి 58,097 కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.
గత తొమ్మిది రోజుల్లో రోజువారీ పెరుగుదల జరగడం ఇది ఆరో సారి కావడం గమనార్హం. దేశంలో ఇప్పటివరకు 2,135 ఓమిక్రాన్ స్ట్రెయిన్ కేసులు గుర్తించగా, అందులో 31 యూపీ నుంచి నమోదయ్యాయి.