హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్షుడిగా అర్శనపల్లి జగన్ మోహన్ రావు ఎన్నికయ్యారు. శుక్రవారం జరిగిన అసోసియేషన్ ఎన్నికల్లో యునైటెడ్ మెంబర్స్ ఆఫ్ హెచ్‌సీఏ ప్యానెల్ నుంచి పోటీ చేసిన జగన్ మోహన్ రావు ఒక్క ఓటు మెజార్టీతో ప్రెసిడెంట్ పదవిని సొంతం చేసుకున్నారు.
జగన్ మోహన్ రావుకు మొత్తం 63 ఓట్లు రాగా, ఆయన సమీప అభ్యర్థి అమర్నాథ్కు 62 ఓట్లు వచ్చాయి. బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్, మాజీ క్రికెటర్ శివలాల్ యాదవ్, అర్షద్ ఆయుబ్ మద్దతుతో బరిలోకి దిగిన క్రికెట్ ఫస్ట్ ప్యానెల్ నుంచి అమర్నాథ్ అధ్యక్షునిగా పోటీ చేశారు.
జగన్ మోహన్ రావు ప్యానెల్‌కు అధికార బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చింది. బీజేపీ నేత, హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు వివేక్ వెంకటస్వామి మద్దతుతో గుడ్ గవర్నెన్స్ ప్యానెల్ నుంచి పోటీలో నిలిచిన అనిల్ కుమార్‌కు 30 ఓట్లు రాగా, ఆనెస్ట్ హార్డ్ వర్కింగ్ హెసీఏ ప్యానెల్ నుంచి పోటీ చేసిన పీఎల్ శ్రీనివాస్‌కు 10 ఓట్లు మాత్రమే పడ్డాయి.
గుడ్ గవర్నెన్స్ ప్యానెల్ నుంచి దళ్జిత్ సింగ్ 17 ఓట్ల మేజార్టీతో వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. ఆయనకు మొత్తం 63 ఓట్లు పడ్డాయి. క్రికెట్ ఫస్ట్ ప్యానెల్ నుంచి పోటీ చేసిన టీ శ్రీనివాస్‌కు 46 ఓట్లు రాగా, యునైటెడ్ మెంబర్స్ ఆఫ్ హెచ్‌సీఏ ప్యానెల్‌కు చెందిన పీ శ్రీధర్‌కు 41 ఓట్లు వచ్చాయి.
గుడ్ గవర్నెన్స్ ప్యానెల్ వైస్ ప్రెసిడెంట్ పదవితో పాటు జాయింట్ సెక్రటరీ పదవిని సొంతం చేసుకుంది. జాయింట్ సెక్రెటరీగా బసవరాజు ఎన్నికయ్యారు. ఆయనకు 60 ఓట్లురాగా.. శ్రీధర్‌కు 59, నోయల్ డేవిడ్‌కు 40, సతీష్‌కు 8 ఓట్లు పడ్డాయి.
బీఆర్ఎస్ మద్దతు తెలిపిన యునైటెడ్ మెంబర్స్ ఆఫ్ హెచ్‌సీఏ ప్యానెల్‌కు అధ్యక్ష పదవితో పాటు ట్రెజరర్ పదవి దక్కింది. ట్రెజరర్ గా సిజే శ్రీనివాస్ రావు విజయం సాధించారు. ఆయనకు 66 ఓట్లు రాగా.. సమీప ప్రత్యర్థి సంజీవ్‌కు 33 ఓట్లు దక్కాయి.
తృటిలో అధ్యక్ష పదవి కోల్పోయిన క్రికెట్ ఫస్ట్ ప్యానెల్ ఒక్క కౌన్సిలర్ పదవిని మాత్రమే సొంతం చేసుకుంది. సునీల్ కుమార్ 59 ఓట్లతో ఈ పదవిని దక్కించుకున్నారు. సమీప అభ్యర్థులు అన్సార్ అహ్మద్‌కు 50 ఓట్లు రాగా.. వినోద్ ఇంగ్లేకు 47 వచ్చాయి.
