టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయి, ఐదు వారాలుగా జైలులో ఉన్న నేపథ్యంలో ఆమె ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వెల్లడించారు.
‘నిజం గెలవాలి’ పేరుతో నారా భువనేశ్వరి ఈ నెల 25 నుంచి రాష్ట్రంలో యాత్ర చేపడతారని తెలిపారు. చంద్రబాబు అరెస్ట్ అయ్యాక ఆవేదనతో మరణించినవారిని ఆమె పరామర్శిస్తారని వివరించారు. చంద్రగిరి నియోజకవర్గం నుంచి భువనేశ్వరి యాత్ర ప్రారంభిస్తారని వెల్లడించారు.
యాత్ర ప్రారంభానికి ముందు భువనేశ్వరి ఈ నెల 24న తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారని, తిరుమల నుంచి అదే రోజున బయల్దేరి నారావారిపల్లెకు వెళ్తారని లోకేశ్ వివరించారు భువనేశ్వరి ఈ నెల 25వ తేదీ నుంచి నిజం గెలవాలి పేరుతో చేపట్టబోయే యాత్రకు తగిన భద్రత కల్పిచాలంటూ డీజీపీకి లేఖ రాశారు టీడీపీ నేత వర్ల రామయ్య.
చంద్రబాబు అక్రమ అరెస్ట్ తో మనస్తాపం చెంది మరణించిన కుటుంబాలను పరామర్శించనున్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అవాంచనీయ సంఘటనలు ఏవీ కూడా జరగకుండా ఉండే విధంగా భువనేశ్వరికి తగిన బందోబస్త్ కల్పించాలంటూ లేఖ లో పేర్కొన్నారు. రాష్ట్రంలో భువనేశ్వరి యాత్ర జరిగే ప్రాంతాల్లో తగిన విధంగా భద్రత ఇవ్వాలని లేఖలో ప్రస్తావించారు.
వారానికి రెండు మూడు నియోజకవర్గాల్లో ఆమె పర్యటన ఉండేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. చిన్న చిన్న సభలు, సమావేశాల్లో కూడా ఆమె పాల్గొంటారు. భువనేశ్వరి ప్రజాక్షేత్రంలోకి రావడం ఇదే ప్రథమం.