ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య ఇండియా – కెనడా దేశాల మధ్య తీవ్ర దౌత్య వివాదానికి కారణమైంది. ఈ వివాదంలో కెనడాకు మద్దతుగా అమెరికా, బ్రిటన్ నిలిచాయి. దౌత్య సమానత్వం కోసం కెనడాకు సంబంధించిన 41 మంది దౌత్యవేత్తలను ఉపసంహరించుకోవాలని భారత్ కోరింది.
ఈ నెల 10 వరకు డెడ్ లైన్ విధించింది. లేకపోతే వారికి దౌత్యవేత్తలకు ఇస్తున్న రక్షణలను తొలగిస్తామని తెలిపింది. ఇరు పక్షాల చర్చల కారణంగా ఇది ఈ నెల 20 గడువు ఇచ్చింది. ఈ నేపథ్యంలో శుక్రవారం కెనడా తన 41 మంది దౌత్యవేత్తలను భారత్ నుంచి తిరిగి రప్పించుకుంది.
భారత్ వియన్నా కన్వెన్షన్‌ను ఉల్లంఘిస్తుందని కెనడా విమర్శించింది. దౌత్య సమానత్వాన్ని కోరుకోవడాన్ని నిబంధనల ఉల్లంఘనగా చెప్పుకోవద్దని భారత్ కెనడాకు సూచించింది. ప్రస్తుతం భారత్, కెనడాల్లో ఇరు వైపుల 21 మంది దౌత్యవేత్తలు ఉన్నారు.
ఈ నేపథ్యంలో మరోసారి కెనడాకు అమెరికా, బ్రిటన్ దేశాలు వత్తాసు పలికాయి. వియన్నా ఒప్పంద సూత్రాలను, దౌత్యసంబంధాలపై భారత్ తన బాధ్యతలను నిర్వర్తించాలని తాము ఆశిస్తున్నట్లు అమెరికా వ్యాఖ్యానించింది. మరోవైపు యుకె కూడా కెనడాకు మద్దతు ప్రకటించింది.
”భారత్ నుంచి కెనడా దౌత్యవేత్తలను వెనక్కి పిలిపించాలనే భారత నిర్ణయాన్ని మేం అంగీకరించలేము. దౌత్యపరమైన రక్షణలను ఏకపక్షంగా ఎత్తివేయడం, వియన్నా ఒప్పందానికి అనుగుణంగా లేదు” అంటూ బ్రిటన్ విదేశాంగ కార్యాలయ అధికార ప్రతినిధి వెల్లడించారు.
మరోవంక, కెనడాలోని కన్జర్వేటివ్ పార్టీ నేత పియరీ పొయిలీవ్రే భారత్‌తో దౌత్యపరమైన వివాదంపై ప్రధాని జస్టిన్ ట్రూడోపై విమర్శలు గుప్పించారు. ‘నమస్తే రేడియో టొరెంటో’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో ట్రూడో నవ్వులపాలయ్యారని ధ్వజమెత్తారు.
2025లో కెనడాలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఆయన ప్రధాని పదవి రేసులో బరిలోకి దిగుతున్నారు. ప్రస్తుతం నిర్వహించిన ఒపీనియన్ పోల్స్‌లో కన్జర్వేటివ్ పార్టీ ముందున్నది. ఈ నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
రాబోయే ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే భారత్‌తో వృత్తిపరమైన సంబంధాలను పెంచుకుంటామని తెలిపారు. విదేశాలతో సంబంధాలను చెడగొట్టారని ఆరోపించారు. ప్రపంచంలోనే ప్రధాన శక్తులతో పెద్ద వివాదాల్లో ఉన్నామని.. ఇందులో భారత్ కూడా ఉందని పేర్కొన్నారు.
భారత్‌తో కెనడాకు వృత్తిపరమైన సంబంధాలు అవసరమని, తాను ప్రధాని అయ్యాక సంబంధాలను పునరుద్ధరిస్తామని స్పష్టం చేశారు. కాగా, కెనడాలో చైనా జోక్యం చేసుకుంటుందని.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కెనడా ప్రధానితో ఆడుకుంటున్నారని ఆరోపించారు. ట్రూడో ఎనిమిదేళ్ల పదవీకాలంలో ప్రతిష్ట మసకబారిందని విమర్శించారు.