భారత్‌కు చెందిన 8 మంది మాజీ నేవీ అధికారులకు మరణ శిక్ష పడటం ప్రస్తుతం సంచలనంగా మారింది. ఈ అధికారులకు ఖతార్ కోర్టు మరణ దండన విధిస్తూ తాజాగా గురువారం తుది తీర్పు వెలువరించింది. ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది.
ఖతార్ కోర్టు భారత మాజీ అధికారులను దోషులుగా తేల్చి మరణశిక్ష విధించడం పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. ఈ తీర్పుపై చట్టపరంగా ఉన్న అన్ని చర్యలను తీసుకుంటామని కేంద్రం స్పష్టం చేసింది. బాధితుల కుటుంబ సభ్యులతోపాటు న్యాయ బృందంతో మాట్లాడుతున్నట్లు వివరించింది.
అయితే ఈ 8 మంది భారత మాజీ నేవీ అధికారులు ఇజ్రాయెల్‌కు గూఢచారులుగా పనిచేసినట్లు ఆరోపణలున్నాయి. ఈ తీర్పు గురించి ఖతార్ ప్రభుత్వంతో మాట్లాడుతున్నామని విదేశాంగ శాఖ వర్గాలు వెల్లడించాయి. దీనిపై అవసరమైన అన్ని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది.
భారత నేవీ మాజీ అధికారులు కెప్టెన్ నవతేజ్ సింగ్ గిల్, కెప్టెన్ బీరేంద్ర కుమార్ వర్మ, కెప్టెన్ సౌరభ్ వశిష్ట్, కమాండర్ అమిత్ నాగ్‌పాల్, కమాండర్ పూర్ణేందు తివారీ, కమాండర్ సుగుణాకర్ పాకాల, కమాండర్ సంజీవ్ గుప్తా, సెయిలర్ రాగేష్లకు ఖతార్ కోర్టు మరణ శిక్ష విధించింది.
ఖతార్ సాయుధ దళాలకు శిక్షణ, సేవలు అందించే ప్రైవేట్ సంస్థ దహ్రా గ్లోబల్ టెక్నాలజీస్ అండ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ కోసం ఆ దేశంలో పనిచేసిన ఈ 8 మంది ఇజ్రాయెల్‌కు గూఢచారులుగా వ్యవహరించినట్లు ఖతార్ అధికారులు ఆరోపణలు చేశారు. అయితే ఈ 8 మంది భారత మాజీ నౌకాదళ అధికారుల తరఫున దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను ఖతార్ కోర్టు తిరస్కరించింది.