గాజాలో కాల్పుల విరమణ తీర్మానంపై ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో జరిగిన ఓటింగ్‌కు భారత్ దూరంగా ఉన్నది. ఇజ్రాయెల్, హమాస్ వివాదంలో తక్షణ మానవతావాద సంధికి పిలుపునిస్తూ ప్రతిపాదించిన ముసాయిదా తీర్మానంపై ఓటు వేసేందుకు భారత్ నిరాకరించింది.
ఉగ్రవాద సంస్థ హమాస్ గురించి ఎలాంటి ప్రస్తావన లేకపోవడంతో ఈ తీర్మానానికి మద్దతు ఇవ్వలేదని భారత్ వెల్లడించింది. కాగా, గాజాలో కాల్పుల విరమణ, అవరోధం లేకుండా మానవతా సహాయం కోసం జోర్డాన్ సమర్పించిన ఈ తీర్మానానికి బంగ్లాదేశ్, మాల్దీవులు, పాకిస్థాన్, రష్యా, దక్షిణాఫ్రికాతో సహా 40కు పైగా దేశాలు మద్దతిచ్చాయి.
‘గాజాలో పౌరుల రక్షణ, చట్టపరమైన మానవతా బాధ్యతలను సమర్ధించడం’ అన్న శీర్షికతో రూపొందించిన ఈ తీర్మానానికి అనుకూలంగా 120 దేశాలు ఓటు వేశాయి. 14 దేశాలు వ్యతిరేకించగా 45 దేశాలు గైర్హాజరయ్యాయి. భారత్‌తో పాటు, ఆస్ట్రేలియా, కెనడా, జర్మనీ, జపాన్, ఉక్రెయిన్, బ్రిటన్ ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి.
అయితే ఓటింగ్‌కు దూరంగా ఉండడానికి గల కారణాలను భారత్ వివరించింది. తీర్మానంలో ఎక్కడా హమాస్ గురించి ఎలాంటి ప్రస్తావనా లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా పేర్కొంది. ఈ విషయంలో జోర్డాన్ తీరును తప్పుబట్టింది. ఉగ్రవాదం విషయంలో ఐక్యరాజ్యసమితి స్పష్టమైన సందేశం పంపించాల్సిన అవసరం ఉందని భారత్ తెలిపింది.
‘ఈ అసెంబ్లీ చర్చలు ఉగ్రవాదం, హింసకు వ్యతిరేకంగా స్పష్టమైన సందేవాన్ని పంపుతాయని, దౌత్యం చర్చల అవకాశాలను విస్తరింపజేస్తాయని మేము ఆశిస్తున్నాం’ అని ఐక్య్యరాజ్య సమితిలో భారత దేశ డిప్యూటీ శాశ్వత ప్రతినిధి యోజనా పటేల్ తెలిపారు.
మరోవైపు ఐరాస సాధారణ అసెంబ్లీలో ఈ తీర్మానంపై ఓటింగ్‌కు ముందు కెనడా ప్రతిపాదించిన టెక్ట్ సవరణకు అమెరికా పట్టుబట్టింది. అయితే తీర్మానం సవరణ కోసం జరిగిన ఓటింగ్‌లో భారత్ సహా 87 దేశాలు అనుకూలంగా ఓటు వేశాయి.
55 దేశాలు వ్యతిరేకంగా ఓటు వేయగా, 23 గైర్హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ముసాయిదా సవరణను ఆమోదించలేమని ఐరాస సాధారణ అసెంబ్లీ 78వ సెషన్ అధ్యక్షుడు డెన్నిస్ ఫ్రాన్సిస్ ప్రకటించారు.