గతంలో అరెస్ట్ సమయంలో తనను చిత్రహింసలకు గురిచేసిన ఇద్దరు ఐపీఎస్ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు లేఖ వ్రాసారు. గతంలో ఏపీ సిఐడి తనను అరెస్ట్ చేసిన సమయంలో పోలీసులు తనను విచక్షణారహితంగా కొట్టారని, నడవలేని పరిస్థితికి తెచ్చారని ఆయన ఆరోపించారు.
ఈ కేసులో కోర్టు ఆయనకు బెయిల్ ఇచ్చింది. తనపై కస్టోడియల్ హింసకు పాల్పడిన ఐపీఎస్ అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రధానిని విజ్ఞప్తి చేశారు. సీఐడీ అదుపులోకి తీసుకున్న తర్వాత ఇద్దరు ఐపీఎస్లు తనను హింసించారని ఎంపీ రఘురామ లేఖలో పేర్కొ్నారు. పీవీ సునీల్ కుమార్, పీఎస్ఆర్ ఆంజనేయులు తనను హింసించారని తెలిపారు. వారిద్దరిపై సీబీఐ లేదా ఎన్ఐఏతో దర్యాప్తు చేయించాలని ప్రధాని మోదీకి రాసిన లేఖలో ఎంపీ రఘురామ కోరారు.
రాష్ట్ర ప్రభుత్వంపై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారంటూ సీఐడీ గతంలో రఘురామను అరెస్ట్ చేసింది. పోలీస్ కస్టడీలో తనను హింసించినట్లు అప్పట్లోనే ఎంపీ రఘురామ ఆరోపించారు. తాజాగా ఇద్దరు ఐపీఎస్ అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీకి ఎంపీ రఘురామ లేఖ రాశారు.
నర్సాపురం ఎపీ రఘురామను 2021 మే 14న ఆయన పుట్టిన రోజు నాడే ఏపీ సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్లోని ఎంపీ రఘురామ నివాసంలో నోటీసులు ఇచ్చి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం గుంటూరుకు తరలించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరించారన్న అభియోగాలతో ఆయన పై రాజద్రోహం కేసులు పెట్టారు.
ఎంపీ రఘురామపై 124(A), 153(B), 505 IPC, 120(B) సెక్షన్ల సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. తనను బలవంతంగా అరెస్ట్ చేసిన తర్వాత పోలీసులు తనను తీవ్రంగా కొట్టారని ఎంపీ రఘురామ కోర్టుకు తెలిపారు. ఆ దెబ్బలకు తన కాళ్లు కూడా వాచిపోయి, నడవలేని పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు.
అయితే ఆయనకు గుంటూరు జీజీహెచ్ లో వైద్య పరీక్షలు చేసి, శరీరంపై ఎలా దెబ్బలు లేవని వైద్యులు కోర్టుకు నివేదిక ఇచ్చారు. దీంతో రఘురామ సుప్రీంకోర్టును ఆశ్రయించి, వైద్య పరీక్షలపై పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది.
సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయాలని ఆదేశించింది. అక్కడి వైద్యులు పరీక్షలు నిర్వహించి కోర్టుకు నివేదికను సమర్పించారు. అనంతరం కోర్టు ఎంపీ రఘురామకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.