ఇంటి వద్ద నుంచే ఓటు వేయాలనుకునే వయోవృద్ధులు, దివ్యాంగుల ఓటర్లకు పోస్టల్ బ్యాలెట్ కోసం నిర్దేశిత ఫారంను ముందుగానే అందజేయాలని కేంద్ర ఎన్నికల అధికారులు ఆదేశించారు. తెలంగాణ శాసనసభకు సాధారణ ఎన్నికల నిర్వహణ సందర్భంగా నామినేషన్ల స్వీకరణకు రంగం సిద్ధమవుతున్న సమయంలో రాష్ట్ర ఎన్నికల యంత్రాంగం పనితీరును మరోసారి సమీక్షించి తగు విధంగా సర్వసన్నద్ధం చేయడానికి కేంద్ర ఎన్నికల సంఘానికి చెందిన సీనియర్ అధికారుల బృందం బుధవారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయాన్ని సందర్శించింది.
పోలింగ్ కేంద్రాల వద్ద వారి కోసం ఏర్పాట్లను ప్రతి వివరాలు తెలుసుకునేందుకు ఆసక్తి కనబరిచారు.ఈ బృందంలో కేంద్ర ఎన్నికల సంఘానికి చెందిన సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ ధర్మేంద్ర శర్మ, నితేష్ కుమార్ వ్యాస్, ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాష్ కుమార్ ఉన్నారు. తనిఖీల్లో పట్టుబడుతున్న నగదు విషయంలో తగిన సాక్ష్యాధారాలుంటే ఉదాసీనంగా వ్యవహరించాలని కేంద్ర ఎన్నికల బృందం స్పష్టం చేసింది.
ఎన్నికల తాయిలాలు, బహుమతుల వంటి వాటి ధరను లెక్కగట్టి, నామినేషన్ల ఖరారు తరువాత ఆయా అభ్యర్థుల ఎన్నికల వ్యయంలో కలపాలని కేంద్ర బృందం రాష్ట్ర సిఇఓను ఆదేశించింది. అక్రమ మద్యం, మాదక ద్రవ్యాల తరలింపును అడ్డుకోవడానికి సాంప్రదాయ పద్దతులు కాకుండా ఆధునికంగా ఆలోచించాలని ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలకు, రాష్ట్ర ప్రభుత్వ విభాగాలకు సూచించింది.
ఎఫ్ఎస్టి, ఎస్ఎస్టి, 1950, సువిధ, సి-విజిల్, ఇఎమ్ఎమ్సి పర్యవేక్షణ కోసం ఇంటిగ్రేటెడ్ కంట్రోల్‌రూమ్‌ను ఇప్పటికే ఏర్పాటు చేసినట్లు తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేసింది. ఓటర్ల జాబితా తుది సవరణల తరువాత పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల స్థితి, ఓటరు కార్డుల పంపిణీ, ఓటర్ల సమాచార స్లిప్‌ల విషయంలో తాజా పరిస్థితిని, వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఎంసిఎంసి సర్టిఫికేట్లను రోజువారీగా జారీ చేస్తుండాలని కేంద్ర బృందం ఆదేశించింది.కీలక పోలింగ్ కేంద్రాల్లో నిఘా కెమెరాల ఏర్పాటు పరిస్థితిని ధర్మేంద్ర శర్మ అడిగి తెలుసుకున్నారు. వార్తల కవరేజీకి సంబంధించి చేసిన ఏర్పాట్లను అభినందిస్తూ, ఇంటి వద్ద నుంచే ఓటు వేయాలనుకునే సీనియర్ సిటిజన్లు, దివ్యాంగుల ఓటర్లకు పోస్టల్ బ్యాలెట్ కోసం నిర్దేశిత ఫారాలను ముందుగానే అందజేయాలని అధికారులను ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల వద్ద వారి కోసంచేసిన ఏర్పాట్లను వివరంగా అడిగి తెలుసుకున్నారు.