తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేల ఐటీ దాడులు మరోసారి కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ నేతలు జానారెడ్డి, కేఎల్ఆర్, పారిజాత నర్సింహారెడ్డి ఇళ్లల్లో సోదాలు చేసిన అధికారులు తాజాగా మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని టార్గెట్ చేశారు.
గురువారం ఉదయం ఆయన ఇళ్లు, కార్యాలయాలపై ఏక కాలంలో దాడులు చేశారు. ఖమ్మంలోని ఆయన నివాసంతో పాటు పాలేరులోని క్యాంపు కార్యాలయంలో ఐటి, ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. తెల్లవారుజామున 3 గంటలకు ఎనిమిది వాహనాలలో వచ్చిన అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు.
ఐటీ అధికారులు పొంగులేటి కుటుంబ సభ్యుల నుంచి సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పొంగులేటి అనుచరుల సెల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. అలాగే హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో పొంగులేటికి చెందిన నివాసంలో కూడా ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఆయన గురువారం నామినేషన్ దాఖలు చేస్తున్నట్లు ప్రకటించారు.
తమ పార్టీ నాయకుల ఇళ్లపై ఐటీ దాడులు జరిగే అవకాశం ఉందని ఆయన ముందుగానే చెప్పడం గమనార్హం. తనపైనా, తన కుటుంబంపైనా ఐటీ సోదాలకు ఆస్కారం ఉందని తెలిపారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండు పార్టీలు కుమ్మక్కై తనపై ఐటీ దాడులు చేయించాలని చూస్తున్నాయని ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీ నేతలకు ఇలాంటి ఇబ్బందులు కొన్ని రోజులు తప్పవని పొంగులేటి వ్యాఖ్యానించారు. ఆయన ఇలా చెప్పిన మరుసటి రోజే ఐటీ దాడులు జరగటం కలకలం రేపుతోంది. మరోవంక, బుధవారం ఖమ్మం జిల్లాకే చెందిన కీలక నేత తుమ్మల నాగేశ్వరావు ఇంట్లో పోలీసులు, ఎన్నికల అధికారులు సోదాలు నిర్వహించారు. ఖమ్మంలో ఆయనకు చెందిన రెండు నివాసాల్లో పోలీసులు దాడులు చేశారు.