ఎన్నికల సమయంలో దాదాపు చిన్న, చితక రాజకీయ పార్టీలు కూడా ప్రజలకు వాగ్ధానాలు చేస్తూ ఎన్నికల ప్రణాళికలను విడుదల చేస్తుంటాయి. తాము అధికారంలోకి వస్తే ఏమి చేస్తామో రాతపూర్వకంగా మ్యానిఫెస్టో పేరుతో ప్రకటిస్తాయి. వాటిని అమలు చేస్తారా అనేది అటుంచితే ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయడం అన్ని రాజకీయ పార్టీల్లో జరుగుతుంది.
జాతీయ స్థాయికి ఎదగడానికి ప్రయత్నిస్తూ, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రయత్నిస్తున్న అఖిల భారత మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఎఐఎంఐఎం) పార్టీ మాత్రం అందుకు అతీతం అని చెప్పవచ్చు. అసెంబ్లీ ఎన్నికలు అయినా, పార్లమెంటు ఎన్నికలు అయినా, స్థానిక సంస్థల ఎన్నికలు అయినా ఏ ఎన్నిక అయినా మ్యానిఫెస్టో రూపంలో ప్రజలకు వాగ్దానం చేయడం ఆ పార్టీ చరిత్రలో లేదు.
ఏ నాడు మ్యానిఫెస్టో విడుదలకు ప్రయత్నించిన దాఖలాలు లేదు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసి స్వయంగా ఈ విషయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎల్లప్పుడు ప్రజల్లో ఉంటూ ప్రజల కోసం పనిచేసే తమకు మ్యానిఫెస్టో ఎందుకని ప్రశ్నించారు. తాము ఎప్పుడూ ప్రజల్లో ఉంటూ పనిచేయడమే తమ మ్యానిఫెస్టో అని చెప్పుకొచ్చారు.
నిజానికి ఆ పార్టీ పరిమిత సంఖ్యలో మాత్రమే పోటీ చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఎలాగూ అధికారంలోకి వచ్చేది ఉండదు. ఎక్కడ పోటీ చేసినా ముస్లిం మైనారిటీ ఓటర్లు అధికంగా ఉండే నియోజవర్గాల్లోనే ఆ పార్టీ అభ్యర్థులను నిలబెడుతుంది.
అది తెలంగాణలో అయినా, ఇతర రాష్టాల్లో అయినా ఆ పార్టీ తీరే అది. ఉత్తరాదిన అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఆ పార్టీ పోటీ చేస్తూ వస్తోంది. కొన్ని రాస్ట్రాల్లో ఎంఎల్ఎ సీట్లతో పాటు ఒక ఎంపి సీటును కూడా ఆ పార్టీ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.
మున్సిపాలిటీల్లో కార్పోరేటర్, వార్డు మెంబర్లుగా కూడా ఆ పార్టీ అభ్యర్థులు పోటీ చేసి విజయం సాధించిన సందర్భాలు ఉన్నాయి. అయినా ఎన్నికల ప్రణాళిక అంటూ విడుదల చేయదు. బీఎస్పీ అధినేత్రి మాయావతి సహితం ఎటువంటి ఎన్నికల ప్రణాళిక లేకుండానే ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు. కానీ, బీఎస్పీ నేతలు తెలంగాణాలో ఎన్నికల ప్రణాళిక విడుదల చేశారు.