గత కొన్ని రోజులుగా దేశ రాజధాని ఢిల్లీలో పెరుగుతున్న గాలి కాలుష్యం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రపంచంలో అత్యంత కాలుష్య నగరాల జాబితాలో ఢిల్లీ టాప్‌లో నిలిచింది. అయితే ఇటీవల ఢిల్లీలో మోస్తరు వర్షం పడటంతో గాలి నాణ్యత కొంత మెరుగైంది.
కానీ దీపావళి పండగ సందర్భంగా ప్రభుత్వం, సుప్రీంకోర్టు విధించిన ఆంక్షలను బేఖాతరు చేసిన ఢిల్లీ వాసులు భారీగా బాణసంచా కాల్చడంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. దీపావళి ఎఫెక్ట్‌తో మరోసారి ఢిల్లీలో కాలుష్యం భారీగా పెరిగిపోయింది. ఇక దేశంలోని మరో రెండు నగరాలు కూడా ఢిల్లీతోపాటు ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాల జాబితాలో టాప్ 10 లోకి చేరిపోయాయి.
స్విస్ గ్రూప్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం.. ప్రపంచంలోనే 10 అత్యంత కాలుష్య నగరాల జాబితాలో భారత్ నుంచి 3 నగరాలు నిలిచాయి. ఈ జాబితాలో ఢిల్లీ అగ్రస్థానంలో నిలవగా పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతా, మహారాష్ట్ర రాజధాని ముంబై నగరాలు కూడా టాప్-10 లోకి చేరాయి.
సోమవారం ఉదయం ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 420 నమోదు కాగా.. 196 ఏక్యూఐతో కోల్‌కతా నాలుగో స్థానం, 163 ఏక్యూఐతో ముంబై 8 వ స్థానంలో నిలిచింది. వాతావరణంలో గాలి నాణ్యతను ఏక్యూఐతో కొలుస్తాం. ఈ ఏక్యూఐ 0 నుంచి 50 మధ్య ఉంటే కాలుష్యం లేకుండా పరిస్థితులు మెరుగ్గా ఉన్నట్లు పరిగణిస్తారు.
ఇక ఏక్యూఐ 400 నుంచి 500 మధ్య ఉంటే ప్రమాదకర స్థాయిలో వాయు కాలుష్యం ఉన్నట్లు భావిస్తారు. ఈ ప్రమాదకర స్థాయిలో ఉండే వాయు కాలుష్యం ఆరోగ్యంగా ఉన్న వారిపై కూడా ప్రభావం చూపుతుంది. ఇక ఏదైనా వ్యాధులతో బాధపడే వారికి ఇది అత్యంత ప్రమాదకరమని చెబుతారు.
150 నుంచి 200 ఏక్యూఐ మధ్య వాయు నాణ్యత నమోదైతే అస్తమా, ఊపిరితిత్తులు, గుండె సమస్యలతో బాధపడుతున్న వారు అస్వస్థతకు గురయ్యే అవకాశాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు.