కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ ప్రస్తుతం యూకే పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా ఆ దేశ ప్రధానమంత్రి రిషి సునాక్ ను కలిశారు. జైశంకర్ తన భార్య కోక్యోతో కలిసి ఆదివారం యూకే ప్రధాన మంత్రి అధికారిక నివాసం ‘10 డౌనింగ్ స్ట్రీట్’ కు వెళ్లారు. జైశంకర్ దంపతులకు సునాక్ దంపతులు సాదర స్వాగతం పలికారు.
సునాక్కు భారత ప్రధాని మోదీ తరఫున దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గణపతి విగ్రహాన్ని అందించారు. దాంతోపాటు భారత స్టార్ క్రికెటర్, పరుగుల రారాజు విరాట్ కోహ్లీ సంతకం చేసిన బ్యాట్ ను కూడా సునాక్కు బహుమతిగా ఇచ్చారు.ఇందుకు సంబంధించిన ఫొటోలను యూకే ప్రధానమంత్రి కార్యాలయం అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్టు చేసింది.
రిషి సునాక్, జైశంకర్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపినట్లు ఈ సందర్భంగా పేర్కొంది. మరోవైపు ఈ విషయాన్ని జై శంకర్ సైతం ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఈ మేరకు ఫొటోలను పంచుకుంటూ.. తనకు ఆతిథ్యం ఇచ్చిన సునాక్ దంపతులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఇలా ఉండగా, దీపావళి పండుగను ప్రజలే కాదు పలువురు దేశాధినేతలు కూడా తమ కుటుంబంతో దీపావళిని సెలబ్రేట్ చేసుకున్నారు. భారత మూలాలున్న బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ సైతం ఈ పండుగను గ్రాండ్గా జరుపుకున్నారు. యూకేలోని తన అధికారిక నివాసం 10 డౌనింగ్ స్ట్రీట్ లో భార్య అక్షతా మూర్తి, ఇద్దరు కుమార్తెలతో కలిసి దీపాలు వెలిగించారు.
పండుగ సందర్భంగా అక్షతా మూర్తి, ఇద్దరు కుమార్తెలు కృష్ణ, అనౌష్క సంప్రదాయ దుస్తుల్లో కనిపించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోని సునాక్ తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేశారు. కుటుంబంతో కలిసి దీపావళి జరుపుకోవడం తనకు ఓ ప్రత్యేక క్షణం అని చెప్పారు. ఈ సందర్భంగా యూకే సహా ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఒక్కరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.