గాజాలోని అల్ షిఫా హాస్పిటల్ సామూహిక సమాధిగా మారిందని మంగళవారం ఆ ఆసుపత్రి చీఫ్ మొహమ్మద్ అబు సాల్మియా ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతోమందికి ప్రాణాలు పోయాల్సిన ఆసుపత్రి ఇజ్రాయెల్ సైన్యం దిగ్బందించడం వల్ల నేడు సమాధిగా మారిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. చిన్నారులతో సహా దాదాపు 179 మందిని ఈ ఆసుపత్రి కాంపౌండ్లోనే ఖననం చేసినట్లు ఆయన తెలిపారు.
వైద్య సౌకర్యాల లేమితో వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా అబు సాల్మియా మాట్లాడుతూ.. ‘ఈ ఆసుపత్రిలో చనిపోయిన వారిని ఈ ఆసుపత్రి కాంపౌండ్లోనే సామూహికంగా ఖననం చేయాల్సి వచ్చింది. ఆసుపత్రిలో ఇంధన సరఫరా ఆగిపోవడంతో ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లోని ఏడుగురు శిశువులు, 29 మంది పెద్దలు చనిపోయారు. వారిని ఆసుపత్రిలోనే ఖననం చేశాము’ అని వివరించారు.
ఇంకా మరికొన్ని మృతదేహాలు ఆసుపత్రి కాంప్లెక్స్‌లో పడి ఉన్నాయని చెబుతూ ప్రస్తుతం విద్యుత్ లేదని తెలిపారు. గాజా నగరంలో అతిపెద్ద ఆసుపత్రి అల్ షిఫాపై ఇజ్రాయెల్ నిరంతరం దాడులు కొనసాగిస్తూనే ఉంది. మూడు రోజుల్లో ఆరుగురు నవజాత శిశువులతో సహా 32 మంది రోగులు ఇక్కడ మరణించారు.
గాజాలోని 35 ఆసుపత్రుల్లో 23 పూర్తిగా మూతపడ్డాయి. అనేక ఆసుపత్రులలో, ఆరోగ్య కార్యకర్తలు, రోగులను ఇజ్రాయెల్ సైన్యం లోపలికి మరియు బయటికి అనుమతించడం లేదని గాజా ఆరోగ్యమంత్రిత్వశాఖ నివేదించింది. గాజా నగరానికి పశ్చిమాన ఉన్న అల్-రిమాల్, తాల్ అల్-హవా, అల్-తుఫా, షేక్ అజ్లిన్ పరిసరాలు, బీచ్ శరణార్థి శిబిరంపై బాంబు దాడి జరిగింది.
ఆర్మీ ట్యాంకులు ఉంచినందున అంబులెన్స్‌లు అక్కడికి చేరుకోలేవు. నుసెరత్ శరణార్థుల శిబిరంపై జరిగిన దాడిలో ఏడుగురు చనిపోయారు. ఐక్యరాజ్యసమితి పాఠశాలపై కూడా దాడి జరిగింది. గాజాలో ఇప్పటివరకు 11,360 మందికి పైగా మరణించినట్లు సమాచారం. అయితే కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతినడంతో కచ్చితమైన సమాచారం లభించడం లేదు.
బహుశా ఈ ఆసుపత్రిలో రోగులు, సిబ్బంది, పౌరులతో సహా దాదాపు 10 వేల మంది కంటే ఎక్కువ మంది ఆ ఆసుపత్రిలో ఉన్నారని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. ఇందులో ఉన్న వారిని అంతర్జాతీయ మానవతా రక్షణ చట్టం కింద రక్షించడం జరిగినట్లు తెలిపింది. అయితే ఆపరేషన్ రోగులను, సిబ్బందిని రక్షించాలని యుఎన్ఓ తెలిపింది.