అల్పపీడనంగా మిథిలి తుపాన్ బలహీనపడడంతో… అంతకు ముందు భారీ వర్షాలతో అతలాకుతలమైన త్రిపుర, మిజోరంలో శనివారం ఎలాంటి వర్షాలు కురియలేదు. వాతావరణ శాఖ తాజా సమాచారం ప్రకారం బంగ్లా తీరం దాటిన తరువాత తుపాన్ అల్పపీడనంగా బలహీనపడి, త్రిపుర రాజధాని అగర్తలాకు తూర్పుఆగ్నేయ దిశలో 50 కిమీ దూరంలో కేంద్రీకృతమైంది.
శనివారం ఉదయం నుంచి మిజోరం, త్రిపుర, ఈశాన్య ప్రాంతాల్లో ఆకాశం నిర్మలంగా ఉండి ఎలాంటి జల్లులు కురియలేదని, ఇంతవరకు నష్టాల గురించి ఎలాంటి సమాచారం అందలేదని వాతావరణ శాఖ వెల్లడించింది. వాతావరణ విభాగం అంతకు ముందు భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించడంతో త్రిపుర ప్రభుత్వం ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు అంగన్వాడీ సెంటర్లకు శనివారం శెలవుదినం ప్రకటించింది.
శుక్రవారం పెనుగాలులతో భారీ వర్షాలు కురియడంతో అగర్తలా లోని మహారాజా బీర్ విక్రమ్ విమానాశ్రయంలో అన్ని విమానసర్వీసులకు అంతరాయం కలిగింది. కోల్కతా నుంచి రెండు, గువాహతి నుంచి ఒకటి విమానాలు ల్యాండ్ కాలేకపోయాయి. శనివారం మాత్రం ఎలాంటి వర్షాలు లేకపోవడంతో తెల్లవారు జాము 4 గంటల నుంచే విమాన సర్వీసులు యథావిధిగా రాకపోకలు సాగించాయి.