జమ్ముకశ్మీర్ లోని రాజౌరీ జిల్లాలో జరిగిన భారీ ఎన్కౌంటర్లో నలుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఇదే ఎన్కౌంటర్లో పాకిస్థాన్‌కు చెందిన ఓ కీలక ఉగ్రవాది హతమయ్యాడు. అతడిని పాకిస్థాన్‌కు చెందిన క్వారీగా గుర్తించినట్టు రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి.
లష్కరే తొయిబా (ఎల్ఇటి)లో అతడు ఉన్నతస్థాయి ఉగ్రనేత అని, పేలుడు పదార్థాల తయారీలో నిపుణుడని తెలిపాయి. మరోవైపు ఈ ఎన్కౌంటర్ రెండో రోజు గురువారం కూడా కొనసాగుతున్నట్టు పేర్కొన్నాయి.
“పాక్‌అఫ్గాన్ సరిహద్దుల్లో ఉగ్ర శిక్షణ పొందిన క్వారీ లష్కరే తొయిబాలో హై ర్యాంకు కలిగిన నాయకుడు. గత ఏడాది కాలంగా తన బృందంతో కలిసి రాజౌరీపూంచ్‌లో ఉగ్ర కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు. డాంగ్రీ, కాండీ దాడుల వెనుక సూత్రధారి అతడే” అని రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి.
“ఈ ప్రాంతంలో ఉగ్రవాదాన్ని మళ్లీ ప్రేరేపింప చేయడానికి అతడిని పంపినట్టు తెలుస్తోంది. పేలుడు పదార్ధాల తయారీలోనే కాదు, గుహల్లో దాక్కొని ఉగ్ర కార్యకలాపాలు నిర్వహించడంలో ఆరితేరాడు. శిక్షణ పొందిన స్నైపర్ కూడా ” ఆ వర్గాలు తెలిపాయి.
ఇదిలా ఉండగా రాజౌరీ లోని కాలాకోట్ అడవుల్లో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య బుధవారం జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు కెప్టెన్లు, ఒక హవల్దార్, ఒక జవాను వీరమరణం పొందారు. మరో మేజర్ , జవాను గాయపడ్డారు.
బాజిమాల్ ప్రాంతంలో నక్కిన ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు సైనిక, పోలీస్ బలగాలు రంగం లోకి దిగడంతో భీకర కాల్పులు జరిగాయి. ఈ పరిస్థితి లోనే నలుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. బుధవారం రాత్రి నిలిచిపోయిన ఎన్కౌంటర్ గురువారం మళ్లీ ప్రారంభమైంది.