ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ కు రూ. 100 కోట్ల రూపాయల పోంజీ స్కామ్ కు సంబంధించి మనీ లాండరింగ్ కేసులో నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో చెన్నైలో వచ్చేవారం ప్రజాష్ రాజ్ విచారణకు రావాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తన నోటీసులో పేర్కొంది.
తిరుచ్చికి సంబంధించిన ఒక జువెలరీ గ్రూపు పై నవంబర్ 20వ తేదీన దాడిచేసి 23. 70 లక్షల లెక్క చెప్పని నగదు మరియు కొన్ని ఆభరణాలను స్వాధీనం చేసుకున్న తర్వాత ప్రకాష్ రాజ్ కు ఈడి అధికారులు నోటీసులు జారీ చేయటం అందరిలోనూ ఆసక్తిని రేకెత్తించింది. తిరుచ్చికి సంబంధించిన ఈ ఆభరణాల సంస్థకు ప్రకాష్ రాజ్ ప్రచారకర్తగా ఉన్నారు.
ప్రణవ్ జూవెలర్స్ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న ప్రకాష్ రాజ్ ను ఈ సంస్థకు సంబంధించిన వ్యవహారాలలో ఈడీ అధికారులు విచారించనున్నారు. తమిళనాడు పోలీస్ ఆర్థిక నేరాల విభాగం నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ మనీ లాండరింగ్ కేసును నమోదు చేసి విచారణ జరుపుతోంది.
బంగారంపై పెట్టుబడుల పథకం పేరుతో ప్రజల నుండి రూ. 100 కోట్ల రూపాయలను ప్రణవ్ జువెలర్స్ సేకరించిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎక్కువ రిటర్న్స్ ఇస్తామని చూపించి, పెట్టుబడులు రాబట్టి మోసం చేస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. ఈ జువెలర్స్ కు యాడ్స్ చేసే ప్రచారకర్తగా వ్యవహరించిన ప్రకాష్ రాజ్ వారి నుంచి ఫీజు తీసుకున్నారు.