తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం సాయంత్రం ఐదు గంటల వరకు హోరెత్తిన మైకులు ఒక్కసారిగా మూగబోయాయి. ఇక ఇప్పటి నుంచి పోలింగ్ కొనసాగే వరకు సైలెంట్ పిరియడ్ కొనసాగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం ముగియడంతో, ఎన్నికల ప్రచారానికి వివిధ ప్రాంతాల నుంచి వివిధ నియోజకవర్గాలకు వచ్చిన ఇతర ప్రాంతాల నేతలు ఆయా ప్రాంతాలను వదిలి వెళ్లిపోవాలని ఈసీ సూచించారు
అంతేకాదు గురువారం ఎన్నికల పోలింగ్ కొనసాగనున్న నేపథ్యంలో, గురువారం సాయంత్రం వరకు మద్యం దుకాణాలు బంద్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్ర ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ మీడియాతో మాట్లాడారు. ఎన్నికల ప్రచారానికి సంబంధించి ఎలాంటివి ప్రదర్శించవద్దని ఆయన సూచించారు.
టీవీలు, రేడియోలు, కేబుల్ నెట్వర్క్ లలో ప్రచారం నిషిద్ధమని, ఎవరూ ఎన్నికల ప్రచారానికి పాల్పడవద్దని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. పోలింగ్ ముగిసిన అరగంట తర్వాత వరకు కూడా ఎగ్జిట్ పోల్స్ నిషేధం అని ఆయన స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో ఎన్నికల ప్రచారం చేయొద్దని, సోషల్ మీడియాలో ఎన్నికల ప్రచారం నిషేధం అని పేర్కొన్న ఆయన, ఎవరైనా ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ అనుమతి పొందిన ప్రకటనలకు ప్రింట్ మీడియాలో అవకాశం కల్పించామని పేర్కొన్నారు. సైలెన్స్ పిరియడ్ లో ఫలితాలను ప్రభావితం చేసే వార్తలను మీడియాలో ప్రసారం చేయడానికి వీలు లేదని పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాల సర్వే వివరాలను వెల్లడించడం, పత్రికల్లో ప్రచురించడం, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రసారం చేయడం, ఇతర మాధ్యమాల ద్వారా ప్రజల్లోకి తీసుకొని వెళ్లడం నిషేధం అని స్పష్టం చేశారు.
ఉల్లంఘించిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ వెల్లడించారు. ఓటర్ స్లిప్ లపై పార్టీల గుర్తులు ఉండకూడదని ఆయన తెలిపారు. భారీ భద్రత మధ్య, కట్టుదిట్టంగా ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని, అందుకు ప్రజలు కూడా సహకరించాలని ఆయన తెలిపారు.