నవంబర్ మాసానికి సంబంధించిన జీఎస్టీ వసూళ్ల డేటాను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ నెలలో వసూళ్లు స్వల్ప తగ్గుదలను నమోదు చేసింది. అయితే అత్యధిక మెుత్తంలో జీఎస్టీ వసూళ్లు నమోదైన రాష్ట్రంగా మహారాష్ట్ర తొలిస్థానంలో నిలిచింది.
నవంబర్ 2023లో మెుత్తం జీఎస్టీ వసూళ్లు రూ.1.68 లక్షల కోట్లుగా నమోదయ్యాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. జీఎస్టీ వసూళ్లు రూ.1.5 లక్షల కోట్లు దాటడం ఇది వరుసగా తొమ్మిదో నెల కావటం గమనార్హం.
అక్టోబర్ 2023లో వీటి విలువ రూ.1.72 లక్షల కోట్లుగా ఉన్నాయి. అంటే అక్టోబరుతో పోల్చితే వసూళ్లు 2 శాతం తగ్గుదలను నమోదు చేసింది. ఇదే సమయంలో ఏడాది ప్రాతిపధికన వసూళ్లు 15.1 శాతం పెరిగినట్లు కేంద్రం ప్రకటించింది.
నవంబర్లో సీజీఎస్టీ వసూళ్లు రూ.30,400 కోట్లు కాగా, ఎస్జీఎస్టీ వసూళ్లు రూ.38,200 కోట్లు. ఇది కాకుండా నవంబర్లో ఐజీఎస్టీ వసూళ్లు రూ.87,000 కోట్లుగా ఉన్నాయి. గత 7 నెలల్లో మొత్తం రూ.1.6 లక్షల కోట్ల వసూళ్ల మార్కును జీఎస్టీ 5 సార్లు నమోదు చేసింది.
ఇదే క్రమంలో 2023-24 ఆర్థిక సంవత్సరంలో సగటు నెలవారీ జీఎస్టీ వసూళ్లను పరిశీలిస్తే రూ.1.67 లక్షల కోట్లుగా నమోదైంది. కరోనా తర్వాత నెలవారీ జీఎస్టీ వసూళ్లు పెరగటంతో 2022-23లో సగటున రూ.1.51 లక్షల కోట్ల మేర పన్ను వసూళ్లు నమోదయ్యాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం తెలుస్తోంది.