తమిళనాడు రాజధాని చెన్నై నగరాన్ని మిచౌంగ్ తుఫాను అతలాకుతలం చేసింది. ఆస్తి నష్టంతోపాటు ప్రాణ నష్టం జరిగింది. మిచౌంగ్ తుఫాను కారణంగా సోమవారం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు చెన్నై నగరం, చుట్టుపక్కల జిల్లాలను వణికించాయి. భారీ వర్షాలు, వరదల కారణంగా ఇప్పటివరకు కనీసం 12 మంది ప్రాణాలు కోల్పోయారు.
అయితే మంగళవారం నుంచి చెన్నైలోని చాలా ప్రాంతాలు వర్షాల నుంచి ఉపశమనాన్ని పొందాయి. దీంతో సహాయక సిబ్బంది ప్రభావిత ప్రాంతాలలో రెస్క్యూ, రిలీఫ్ కార్యకలాపాలపై దృష్టి పెట్టడానికి వీలు కలిగింది. చెన్నైలో ప్రాణాలు కోల్పోయిన 12 మందిలో ఫోర్‌షోర్ ఎస్టేట్‌లో 60 ఏళ్ల మహిళ, ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేసిన 48 ఏళ్ల వ్యక్తి ఉన్నారు.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. వర్షం సంబంధిత ఘటనల్లో గాయపడిన మరో పదకొండు మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మంగళవారం సాయంత్రం వరకు వర్షాలు తగ్గడంతో చెన్నై విమానాశ్రయం నుంచి విమానాల రాకపోకలు ప్రారంభమయ్యాయి.
భారీ వర్షాల కారణంగా చైన్నైలోని విమానశ్రయం రన్‌వేపై నీరు నిలిచిపోవడంతో సోమవారం విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. ఏకంగా వెయ్యికి పైగా విమానాలు బంద్ అయ్యాయి. అయితే సోమవారం చెన్నైలో వర్షాలు తగ్గాయి. దీంతో రన్‌వేపై ఉన్న నీటిని సిబ్బంది తొలగించారు. ఈ క్రమంలో మంగళవారం విమాన రాకపోకలు యథావిధిగా ప్రారంభమయ్యాయి.
‘మిచౌంగ్’ తుఫాను సృష్టించిన బీభత్సంతో అతలాకుతలమైన చెన్నై నగరం.. ఇంకా వరదనీటిలోనే నానుతోంది. ప్రధాన వీధులు సైతం వరద నీటిలో తేలియాడుతున్నాయి. జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. నగరంలోని సబర్బన్ రైళ్లతో పాటు సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లు సైతం కదలలేదు.
వరదనీటి కారణంగా బయటి ప్రాంతాల నుంచి దిగుమతులు తగ్గడంతో నగరంలో పాల కొరత ఏర్పడింది. ఇదిలా ఉంటే.. పునరావాస శిబిరాలను సీఎం స్టాలిన్ పరిశీలించి బాధితులను పరామర్శించారు. వారికి దుప్పట్లు, చాప వంటి వాటిని పంపిణీ చేశారు.
చెన్నై పోలీస్ కమిషనర్ సందీప్ రాయ్ రాథోడ్ నగరంలోని వరద ప్రాంతాలను సందర్శించి, తుఫాను కారణంగా ప్రభావితమైన ప్రజలకు సహాయక సామగ్రిని పంపిణీ చేశారు. చెన్నైతో పాటు అనేక ప్రాంతాల్లో వరదల్లో మునిగిపోయాయి. భారీ నష్టం సంభవించిన నేపథ్యంలో.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎం కె స్టాలిన్ కేంద్రానికి లేఖ రాశారు.
తక్షణమే రిలీఫ్ ఫండ్ కింద రూ.5060 కోట్లు ఇవ్వాలని ప్రధాని మోదీని కోరుతూ సీఎం స్టాలిన్ లేఖ రాశారు. మిగ్జాం వల్ల నష్టం జరిగిందని, ఆ నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర సర్కారు బృందాన్ని పంపాలని ఆయన కోరారు. ఢిల్లీలో డీఎంకే ఎంపీ టీఆర్ బాలు స్వయంగా ఆ లేఖను ప్రధాని మోదీకి అందజేయనున్నారు.
కాగా, దక్షిణ ఛత్తీస్‌గఢ్, దక్షిణ కోస్తాంద్ర, ఒడిశాలోని దక్షిణ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. దీంతో ఒడిశాలోని దక్షిణ జిల్లాలు మంగళవారం రాత్రి అప్రమత్తమయ్యాయి. ఛత్తీస్‌గఢ్, విదర్భ ప్రాంతంలోనూ ఈ రోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. “ప్రస్తుతం పరిస్థితి సాధారణంగా ఉంది. రాబోయే 24 గంటల్లో కురిసే వర్షాల తీవ్రత పెరుగుతుందని అంచనా వేస్తున్నాం. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పరిపాలనా యంత్రాంగం అవసరమైన ముందుజాగ్రత్త చర్యలు చేపట్టింది” అని కోరాపుట్ కలెక్టర్ అబ్దాల్ అక్తర్ తెలిపారు.