తెలంగాణ మూడో అసెంబ్లీ కొలువుదీరింది. శనివారం ఉదయం 11 గంటలకు శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ.. ఎమ్మెల్యేల చేత ప్రమాణస్వీకారం చేయించారు. మొదట సీఎం రేవంత్ రెడ్డి, ఆ తర్వాత మంత్రులు భట్టి విక్రమార్క, సీతక్క, శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వర్ రావు ప్రమాణం చేశారు.
అనంతరం ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 61 మంది, బీఆర్ఎస్ నుంచి 32 మంది, ఎంఐఎం నుంచి ఆరుగురు, సీపీఐ నుంచి ఒకరు ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. ప్రొటెం స్పీకర్‌తో కలిపి మొత్తం 101 మంది ప్రమాణం చేశారు. అయితే, నిబంధనల మేరకు సీనియర్ శాసనసభ్యుడిని కాకుండా ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ను ప్రొటెం స్పీకర్ గా నియమించడం పట్ల నిరసన వ్యక్తం చేస్తూ, ప్రమాణస్వీకారం చేసేందుకు బిజెపి సభ్యులు తిరస్కరించారు. వారు అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించారు.
గవర్నర్ కు సమర్పించిన వినతిపత్రంలో తమ నిరసనను వ్యక్తం చేశారు. గవర్నర్ అందుబాటులో లేకపోవడంతో శనివారం రాజ్‌భవన్‌లో గవర్నర్ సెక్రెటరీని ఎమ్మెల్యేలు కలిశారు. ఈ సందర్భంగా ప్రొటెం స్పీకర్ నియమాకంపై గవర్నర్ సెక్రెటరీకి కమలం పార్టీ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు.
సీనియర్‌ను కాకుండా ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్‌ను నియమించటాన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ప్రోటైం స్పీకర్ ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ఉండటంతో ప్రమాణ స్వీకారానికి బీజేపీ ఎమ్మెల్యేలు దూరంగా ఉన్నారు. ఎంఐఎం రజాకార్ల పార్టీ అని తెలంగాణలో రజాకారులు చేసిన ఆకృత్యాలను భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు గుర్తుచేస్తున్నారు.
గవర్నర్ కార్యదర్శి సురేంద్రమోహన్ను కలిశామని చెబుతూ అక్బరుద్దీన్ ఓవైసీని ప్రోటెం స్పీకర్‌గా స్పీకర్‌గా నియమించడంపై ఫిర్యాదు చేసినట్లు బిజెపి ఎమ్యెల్యే మహేశ్వరరెడ్డి తెలిపారు. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ కంటే ఆరుగురు సీనియర్ సభ్యులు ఉన్నప్పటికీ ఎంఐఎం ఎమ్మెల్యే అభ్యర్థులు ఓవైసీనే ప్రొటైం స్పీకర్‌గా ఎందుకు నియమించాల్సి వచ్చిందని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం ఒక్కటే అని ధ్వజమెత్తారు. అక్బరుద్దీన్ ఓవైసీని ప్రోటైం స్పీకర్‌గా నియమించడంపై అసెంబ్లీలోని గాంధీ విగ్రహం దగ్గర నిరసన చేయనున్నట్లు మహేశ్వర్‌రెడ్డి తెలిపారు.
అంతకు ముందు, భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయాన్ని బీజేపీ ఎమ్మెల్యేలు ప్రత్యేక సందర్శించారు. అమ్మవారిని దర్శించకుని ప్రత్యేక పూజలు చేశారు. బీజేపీ ఎమ్మెల్యతోపాటు రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి కూడా అమ్మవారిని దర్శించుకున్నారు.