ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తమిళనాడు ఉన్నత విద్యాశాఖ మంత్రి, డీఎంకే నేత కె.పొన్ముడికికి మద్రాస్ హైకోర్టు మూడు సంవత్సరాల జైలుశిక్ష, రూ. 50 లక్షల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. దీంతో శిక్షను తగ్గించాలని కోరుతూ పొన్ముడి, ఆయన భార్య కోర్టుకు మెడికల్ రికార్డు సమర్పించారు.
మంత్రి వయసు 73 సంవత్సరాలు, ఆయన భార్య వయసు 60 ఏళ్లని, కాబట్టి శిక్షను తగ్గించాలని కోరారు. పొన్ముడికి సాధారణ జైలు శిక్ష, ఆయనకు, ఆయన భార్యకు ఒక్కొక్కరికి రూ. 50 లక్షల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది.
కాగా, శిక్షను పైకోర్టులో అప్పీలు చేసుకునేందుకు 30 రోజుల సమయం ఇచ్చింది. రూ.1.75 కోట్ల ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో పొన్ముడి, ఆయన భార్యను నిర్దోషులుగా ప్రకటిస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును రెండు రోజుల క్రితం కొట్టేసిన హైకోర్టు వారిని దోషులుగా ప్రకటించి శిక్షపై తీర్పును వాయిదా వేసింది.
తాజాగా, గురువారం ఉదయం తీర్పు ప్రకటించింది. దీంతో ప్రస్తుతం ఆయన నిర్వహిస్తున్న ఉన్నత విద్యాశాఖను వేరొకరికి అప్పగించనున్నారు. ఈ కేసు 2006-2011 హయాం నాటిది. అప్పట్లో పొన్ముడి రూ.1.36 కోట్లకు పైగా ఆస్తులు కూడబెట్టినట్టు 2011లో అన్నాడీఎంకే నేత కోర్టుకెక్కారు.
మంత్రి అమన్ అరోరాకు రెండేళ్ల జైలు
ఇలా ఉండగా, పంజాబ్ కేబినెట్ మంత్రి అమన్ అరోరాకు సునమ్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. కుటుంబ వివాదాల కేసులో అమన్ అరోరాకు ఈ శిక్ష విధించించింది. అమన్ అరోరాతో సహా తొమ్మిది మందికి రెండేళ్ల జైలు శిక్షను విధిస్తూ తీర్పును వెలువరించింది.
మంత్రి అమన్ అరోరా బావ రాజిందర్ దీప 2008లో కోర్టులో ఫిర్యాదు చేశారు. అమన్ అరోరాతో పాటు ఆయన సహచరులు తన ఇంట్లోకి ప్రవేశించి తనపై దాడికి పాల్పడ్డారని రాజిందర్ దీపా కోర్టులో ఫిర్యాదు చేశారు. ఆ సమయంలో అమన్ అరోరా, రాజిందర్ దీపా ఇద్దరూ కాంగ్రెస్లో ఉన్నారు.
సునామ్లో ఇద్దరు నేతల ఇండ్లు ఎదురెదురుగా ఉండగా, ఇద్దరి మధ్య రాజకీయ వైరం ఉన్నది. అయితే, ప్రస్తుతం ఇద్దరు నేతలు కాంగ్రెస్ నుంచి వైదొలిగారు. ప్రస్తుతం అమన్ అరోరా ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నాయకుడు కాగా.. కేబినెట్ మంత్రిగా కొనసాగుతున్నారు. రాజిందర్ దీపా అకాలీదళ్ ప్రధాన కార్యదర్శిగా పని చేస్తున్నారు.