అరేబియా సముద్రంలో ఓ వాణిజ్య నౌకపై డ్రోన్ దాడి జరిగింది. ఆ దాడితో నౌకలో పేలుడు, అగ్నిప్రమాదం సంభవించింది. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఆ నౌకలోని సిబ్బందిలో 20 మంది భారతీయులు ఉన్నారు. భారతీయులు సహా నౌకలోని సిబ్బంది అంతా సురక్షితంగా ఉన్నట్లు తెలుస్తోంది.
డ్రోన్ దాడి అనంతరం ఆ నౌకకు రక్షణ కల్పించడానికి ఇండియన్ కోస్ట్ గార్డ్ కు చెందిన ఐసీజీఎస్ విక్రమ్ ఆ షిప్ వైపు బయలుదేరింది. ఆ వాణిజ్య నౌకపై డ్రోన్ పై ఎవరు దాడి చేశారనే విషయం ఇంకా వెల్లడి కాలేదు. ఆ దాడికి బాధ్యులమంటూ ఏ సంస్థ కానీ, వ్యక్తి కానీ ప్రకటించలేదు.
గత నెలలో హిందూ మహాసముద్రంలో ఇరాన్ కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ జరిపిన డ్రోన్ దాడిలో ఇజ్రాయెల్ కు చెందిన సరుకు రవాణా నౌక ధ్వంసమైన విషయం తెలిసిందే. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ప్రారంభమైన తర్వాత ఎర్ర సముద్రంలో డ్రోన్ దాడులు, ఇరాన్ మద్దతు కలిగిన హౌతీలు జరిపిన క్షిపణి దాడులు కూడా పెరిగాయి.
తాము హమాస్ కు మద్దతిస్తున్నామని, ఈ కారణంగా ఇజ్రాయెల్ తో ముడిపడి ఉన్న వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకుంటామని హౌతీలు ప్రకటించారు. దీంతో నౌకలు తమ గమనాన్ని మార్చుకుని ఆఫ్రికా దక్షిణ భాగం చుట్టూ తిరిగి వెళ్లే మార్గాలను ఎంచుకోవాల్సి వస్తోందని తెలిపారు.
గాజాలో అమెరికా, దాని మిత్ర దేశాలు నేరాలకు పాల్పడితే మధ్యధరా సముద్రాన్ని, జిబ్రాల్టర్ జలసంధి, ఇతర జలమార్గాల మూసేస్తామని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కమాండర్ ఒకరు హెచ్చరించారు.