పాకిస్థాన్ లో 2024లో జరగనున్న ఎన్నికల్లో జనరల్ స్థానానికి ఓ హిందూ మహిళ నామినేషన్ దాఖలు చేసింది. ఖైబర్ పఖ్తుంఖ్వాలోని బునేర్ జిల్లాలోని పీకే-25 జనరల్ స్థానానికి డా. సవీరా ప్రకాశ్ 23న అధికారికంగా పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పిపిపి) అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. దీంతో జనరల్ ఎన్నికల్లో పోటీచేస్తున్న తొలి మహిళగా రికార్డుల్లో నిలిచారు.
పాకిస్థాన్ లోని 16వ జాతీయ అసెంబ్లీ సభ్యులను ఎన్నుకునేందుకు ఫిబ్రవరి 8న సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల సంఘం (ఈసీపీ) ఇటీవల చేసిన సవరణల ప్రకారం జనరల్ సీట్లలో ఐదు శాతం మహిళా అభ్యర్థులకు అవకాశం కల్పించాల్సి ఉంటుంది. పాకిస్థాన్ లోని హిందూ కమ్యూనిటీకి చెందిన సవీరా ప్రకాశ్ సార్వత్రిక ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేసిన తొలి మహిళా అభ్యర్థి.
35 ఏండ్ల డాక్టర్ సవీరా ప్రకాశ్ అబోట్టాబాద్ ఇంటర్నేషనల్ మెడికల్ కాలేజీ నుంచి 2022లో ఎంబీబీఎస్ పట్టా అందుకున్నారు. అమె తండ్రి ఓమ్ ప్రకాశ్ కూడా డాక్టర్ కావడం విశేషం. ఇటీవలే పదవీ విరమణ చేసిన ఆయన 35 ఏండ్లుగా పీపీపీలో క్రియాశీలక సభ్యుడిగా ఉన్నారు.
తన తండ్రి అడుగుజాడల్లోనే నడుస్తున్న సవీరా.. గత కొన్నేండ్లుగా బనేర్ పీపీపీ మహిళా విభాగానికి జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. తన గెలుపుపై గట్టి నమ్మకంతో ఉన్న ఆమె ఈ ప్రాంతంలో మహిళా సాధికారత, భద్రత, మహిళ హక్కుల కోసం ఆమె తన గళాన్ని వినిపిస్తున్నారు.
అభివృద్ధిలో మహిళలను నిర్లక్ష్యం చేస్తున్నారని, అణచివేతకు గురిచేస్తున్నారని పేర్కొంటూ మహిళల అభ్యున్నతి కోసం పనిచేయడం, వారికి సురక్షితమైన వాతావరణాన్ని కల్పించడం, వారి హక్కుల కోసం వాదించడం తన లక్ష్యమని సవీరా ప్రకాశ్ చెప్పారు. సేవ చేయడం తన రక్తంలోనే ఉందని ఆమె పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనెలకొన్న దారుణ పరిస్థితులను చూసిన తరువాత ప్రజాప్రతినిధిగా మాత్రమే పరిస్థితులను చక్కదిద్దగలనని భావించానని ఆమె తెలిపారు.
