దేశ రాజధాని ఢిల్లీలో దట్టమైన పొగమంచు కొనసాగుతోంది. గురువారం ఉదయం కూడా ఢిల్లీని దట్టమైన పొగమంచు కమ్మేసింది. ఢిల్లీతోపాటు పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు చుట్టుముట్టింది. రహదారులపై దృశ్యమానత దాదాపుగా సున్నాకి పడిపోయింది. అలాగే ఉష్ణోగ్రతలు కూడా భారీగా పడిపోయాయి.
నగరంలో ఉష్ణోగ్రత 6 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయాయి. దీంతో ఢిల్లీలో తీవ్ర స్థాయిలో చలిగాలులు వీస్తున్నాయి. దట్టమైన పొగమంచు, తక్కువ దృశ్యమానత కారణంగా కొన్ని రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, ఢిల్లీ-ఎన్సీఆర్లలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో ఉత్తర భారతదేశం మొత్తం చలి గాలులు వీస్తున్నాయి.
ఢిల్లీలో దట్టమైన పొగమంచు ఏర్పడడాన్ని స్థానిక వాతావరణ విభాగం ధృవీకరించింది. పొగమంచు ఏర్పడడానికి పరిస్థితులు ఇంకా అనుకూలంగా ఉన్నందును డిసెంబర్ 29 వరకు ఉపశమనం లభించే అవకాశాలు లేవని పేర్కొంది. డిసెంబర్ 31 లేదా 1 నుంచి ఉత్తర భారతదేశంలో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని దీంతో అప్పుడు పొగమంచు నుంచి ఉపశమనం లభించవచ్చని పేర్కొంది.
దేశ రాజధాని పరిసర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం గురువారం, శుక్రవారం వివిధ నగరాల్లోని పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. ఘజియాబాద్‌లో 1 నుంచి 8వ తరగతి వరకు అన్ని పాఠశాలల సమయాన్ని ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మార్చినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
జలాన్‌లోని 1 నుంచి 8వ తరగతి వరకు అన్ని పాఠశాలలను డిసెంబర్ 31 వరకు మూసివేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం 15 రోజుల పాటు శీతాకాల సెలవులను ప్రకటించింది. కాగా డిసెంబర్ 31, 2023 నుంచి జనవరి 14, 2024 వరకు ఉత్తర భారతదేశంలో చలి గాలులు వీచే అవకాశాలున్నాయి.