గాజాలో అయిదు లక్షల మంది కంటే ఎక్కువ మంది అంటే జనాభాలో నాలుగింట ఒక వంతు మంది ఆకలితో అలమటిస్తున్నారు. అక్టోబర్ 7 నుంచి గాజాపై ఇజ్రాయెల్ సాగిస్తున్న బాంబు దాడులు, ముట్టడి అక్కడ మానవతా సంక్షోభాన్ని ఎత్తి చూపుతోంది. పాలస్తీనియన్ల మరణాల సంఖ్య ఇప్పుడు 20,000కి చేరుకుందని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
నివేదికలోని గణాంకాల ప్రకారం, ఇటీవలి సంవత్సరాలలో ఆఫ్ఘనిస్తాన్, యెమెన్‌లలోని క్షామం కన్నా ఇది తీవ్రమైనది. కరువు ప్రమాదం ”ప్రతిరోజూ పెరుగుతోంది” అని నివేదిక హెచ్చరించింది, గాజాలోకి తగినంత సహాయం అందకపోవడంతో ఆకలి రక్కసి కోరలు చాస్తోంది. ఇది మరింత దిగజారే ప్రమాదముందని ఐరాస ప్రపంచ ఆహార కార్యక్రమం ప్రధాన ఆర్థికవేత్త ఆరిఫ్ హుస్సేన్ హెచ్చరించారు.
గాజాలో ఇంత దారుణమైన మానవీయ సంక్షోభాన్ని ఇదివరకెన్నడూ చూడలేదని ఆయన పేర్కొన్నారు. యుద్ధం కారణంగా గూడు చెదిరిన పక్షుల్లా వలస బాట పట్టిన అయా బర్బఖ్, తాను ప్రతిరోజూ ఆహారం కోసం వస్తానని చెప్పింది.ఇతరుల మాదిరిగానే మమ్మల్ని బతకనివ్వండి. రోజూ చనిపోతున్న మనుషులను చూస్తుంటాం, వాళ్లలాగే చనిపోవాలని అనుకుంటాం. మమ్మల్ని అవమానించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
వంటగదిని నిర్వహించే ఓ స్వచ్ఛంద సంస్థకు చెందిన మహమూద్ అల్-కిషావి మాట్లాడుతూ, వంట చేయడానికి ఇంధనం లేదని, కాబట్టి వారు కలపను కాల్చడానికి చుట్టుపక్కల వెతకవలసి ఉంటుందని చెప్పారు. పెద్ద సంఖ్యలో కుటుంబాలు ఉన్నాయి మరియు వారికి తగినంత ఆహారం మా వద్ద లేదు అని కిషావి వాపోయారు.
ఇజ్రాయెల్‌కు మిగిలి ఉన్న కొద్దిమంది మిత్రదేశాలలో ఒకటైన అమెరికా కాల్పుల విరమణపై పట్టుబట్టడంలో విఫలమైందని గాజాలో ఆకలి తీవ్రతపై గురువారం నాటి నివేదిక స్పష్టం చేసింది. గాజాకు సహాయం అందించేందుకు సంబంధించిన ఐరాస భద్రతా మండలి ఇటీవల ఆమోదించిన తీర్మానం చాలా బలహీనంగా ఉందని వారు నిట్టూర్చారు. అయితే, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అంతర్జాతీయ మద్దతు ఉన్నా లేకున్నా హమాస్‌ను నాశనం చేసే వరకు తమ దాడిని కొనసాగిస్తామని స్పష్టం చేస్తున్నారు.