ఇరాన్ జనరల్ ఖాసిం సులేమానీ సమాధి సమీపంలో వరుసగా రెండు పేలుళ్లు జరగడంతో 100 మందికి పైగా మరణించారు. ఈమేరకు దక్షిణ ఇరాన్ లోని కెర్మాన్ లో సాహెబ్ అల్ జమాన్ మసీదు సమీపంలో భారీ పేలుడు శబ్దం వినిపించిందని స్థానిక మీడియాను ఉటంకిస్తూ ఏఎఫ్‌పీ పేర్కొంది.
కెర్మన్ ప్రావిన్స్ రెడ్ క్రెసెంట్ రెస్క్యూ హెడ్ రెజా ఫల్లా స్పందిస్తూ “మా ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాలు క్షతగాత్రులను తరలిస్తున్నాయి. కానీ గుంపులుగా ఉన్న జనం రోడ్లపై ఆటంకాలు ఎదురువుతున్నాయి..’ అని చెప్పారని రాయిటర్స్ వెల్లడించింది. ఖాసిం సులేమానీ సమాధి వద్ద శబ్దం వినిపించిందని ఇరాన్ ప్రభుత్వ టీవీ నివేదించింది. అయితే పేలుడుకు కారణమేమిటనే దానిపై ఎటువంటి వివరాలు ఇవ్వలేదు.
పేలుళ్ల అనంతరం జరిగిన తొక్కిసలాటలో పలువురు గాయపడ్డారని, ఇరాన్ జనరల్ ఖాసిం సులేమానీ వర్ధంతి నేపథ్యంలో వేలాది మంది సంతాపం తెలుపుతున్నట్లు ప్రత్యక్ష ప్రసారంలో కనిపించిందని, ఘటనా స్థలంలో అంబులెన్స్‌లు కూడా కనిపించాయని వివిధ మీడియా సంస్థల ద్వారా తెలిసింది.
స్మశాన వాటికకు వెళ్లే రహదారిపై పలు గ్యాస్ డబ్బాలు పేలాయని నూర్‌న్యూస్ నివేదించగా, స్థానిక అధికారిని ఉటంకిస్తూ ఇరాన్ ప్రభుత్వ మీడియా “ఈ పేలుళ్లు గ్యాస్ సిలిండర్ల వల్ల సంభవించాయా లేదా ఉగ్రవాద దాడి వల్ల సంభవించాయా అనేది ఇంకా స్పష్టంగా తెలియదు” అని చెప్పారు.
సెంట్రల్ ప్రావిన్స్ కెర్మన్ లో 15 నిమిషాలపాటు పేలుళ్ల శబ్దం వినిపించిందని బ్లూమ్‌బర్గ్ తెలిపింది. ఈ పేలుళ్లు గ్యాస్ పేలుడు వల్ల సంభవించాయా లేక ఉగ్రవాద దాడి వల్ల సంభవించాయా అనేది ఇంకా స్పష్టంగా తెలియరాలేదని ప్రావిన్స్ డిప్యూటీ గవర్నర్‌ను ఉటంకిస్తూ ఇస్లామిక్ రిపబ్లిక్ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. బాగ్దాద్ విమానాశ్రయం వెలుపల అమెరికా డ్రోన్ దాడిలో ఖాసీం సులేమానీ మరణించారు. ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ విదేశీ కార్యకలాపాల విభాగమైన ఖుద్స్ ఫోర్స్‌కు ఆయన నేతృత్వం వహించారు. 2020లో ఆయన మరణంతో ఇరాన్, అమెరికాల మధ్య ప్రత్యక్ష సైనిక ఘర్షణ భయాలు నెలకొన్నాయి.