వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు. న్యూఢిల్లీలోని పార్టీ కార్యాలయంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీల సమక్షంలో గురువారం కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అనంతరం షర్మిల మాట్లాడుతూ వైఎస్సార్ టీపీని కాంగ్రెస్లో విలీనం చేయడం సంతోషంగా ఉందని తెలిపారు.
నేటి నుంచి కాంగ్రెస్లో వైటీపీ ఒక భాగమని చెప్పారు. దేశంలోనే అతిపెద్ద పార్టీ కాంగ్రెస్ అని తెలిపారు. దేశంలో అన్ని వర్గాలను న్యాయం చేసే పార్టీ అని వెల్లడించారు. మల్లికార్జున ఖర్గే షర్మిలకు కాంగ్రెస్ కండువా కప్పి ఆమెను పార్టీలోని ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో రాహుల్ గాంధీ కూడా పాల్గొన్నారు.
అయితే ఈ కార్యక్రమానికి తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎవరూ కూడా హాజరుకాకపోవడం సంచలనంగా మారింది. ఏపీ కాంగ్రెస్ నాయకులు మాత్రం షర్మిల రాకను స్వాగతిస్తున్నారు. ఇదిలా ఉంటే షర్మిల భర్త కాంగ్రెస్ కండువా కప్పుకోవడానికి ఇష్టపడలేదు.
అనంతరం మాట్లాడిన వైఎస్ షర్మిల తన తండ్రి వైఎస్సాఆర్ జీవితమంతా కాంగ్రెస్ పార్టీ కోసం పని చేశారని, తాను కూడా నాన్న వైఎస్ అడుగు జాడల్లో నడుస్తున్నానని చెప్పారు. దేశంలో అతిపెద్ద సెక్యూలర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, అన్ని వర్గాలను కాంగ్రెస్ ఏకం చేసిందని వ్యాఖ్యనించారు.
మణిపూర్లో 2 వేల చర్చిలు ధ్వంసం చేసిన ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని ఆమె చెప్పారు. కేంద్రంలో సెక్యూలర్ పార్టీ అధికారమలో లేనందునే ఇలాంటి ఘోరం జరిగిందని ఆమె తెలిపారు. రాహుల్ గాంధీని ప్రధానిగా చూడటమే వైఎస్ కల అని పేర్కొంటూదాని కోసం తన వంతుగా కృషి చేస్తానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఏ బాధ్యతలు అప్పగించినా విధేయతో నిర్వర్తిస్తానని స్పష్టం చేశారు.
వైఎస్ మరణం తర్వాత ఆయన కుమారుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించగా షర్మిల ఆ పార్టీలో కీలకంగా వ్యవహరించారు. ఉమ్మడి ఏపీలో జగన్ జైలుకు వెళ్లిన సమయంలో పార్టీని భుజాలకెత్తుకొని రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేశారు. 2019లో ఏపీలో వైసీపీ అధికారంలోకి తీసుకురావడం కోసం కష్టపడి పని చేశారు.
2020 వరకు ఆమె వైసీపీలో కొనసాగగా అనుహ్యంగా తెలంగాణ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. తాను తెలంగాణ బిడ్డనే అని.. రాజన్న రాజ్యం స్థాపనే లక్ష్యమంటూ 2021 జులై 8న వైఎస్సాఆర్ తెలంగాణ పార్టీ పేరుతో కొత్త పార్టీని ప్రకటించారు. అనంతరం తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేశారు.
2023 అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తారని, తాను పాలేరు నుంచి బరిలోకి దిగుతానని ప్రకటించారు. అయితే ఎన్నికలకు ముందు అనుహ్యంగా పోటీ నుంచి తప్పుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే ఉద్దేశ్యంతో తమ పార్టీ పోటీ నుంచి తప్పుకుటుంటుందని ప్రకటించారు.
ఇదే సమయంలో హస్తం పెద్దలతో టచ్లోకి వెళ్లారు. హస్తిన వెళ్లి సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో చర్చలు కూడా జరిపారు. ఆ చర్చల ప్రధాన ఉద్దేశ్యం పార్టీ విలీనం. మొదట్లో ఈ విలీన ప్రతిపాదన వార్తలను షర్మిల ఖండిస్తూ వచ్చినప్పటికీ.. ఆ తర్వాత పరోక్షంగా విలీనానికి ఓకే చెప్పారు.