తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈ నెల 11న నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్ల స్వీకరణకు చివరి తేది జనవరి 18. ఈ నెల 29న పోలింగ్ నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. గురువారం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది.
తెలంగాణ శాసనమండలిలో రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయిన సంగతి తెలిసిందే. కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి ఇటీవల రాజీనామా చేశారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున వీరిద్దరూ ఎమ్మెల్యేలుగా గెలవడంతో ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. దీంతో ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది.
మరోవంక, త్వరలో జరుగనున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇటీవలే ఓటరు జాబితా షెడ్యూల్ను విడుదల చేసింది. ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ఓటర్ల నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. పట్టభద్రులందరూ తమ ఓటు నమోదు చేసుకోవాలని ఎన్నికల సంఘం సూచించింది.
ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ఫిబ్రవరి 24న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటించనున్నారు. మార్చి 14 వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. ఏప్రిల్ 4న తుది ఓటర్ల జాబితా విడుదల చేయనుంది. ఇంచుమించుగా అదే సమయంలో లోక్ సభ ఎన్నికలు ఉండే అవకాశం ఉంది.