అంగన్వాడీలపై ‘ఎస్మా’ ప్రయోగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. సమ్మెను నిషేధిస్తూ ఉత్తర్వులను ఇచ్చింది. అంగన్వాడీలను అత్యవసర సర్వీసుల కిందకు తీసుకువచ్చింది. ఈ మేరకు జీవో నెంబరు 2ను విడుదల చేసింది. ఆరు నెలల పాటు సమ్మెలు, నిరసనలు చేయటం నిషేధమని పేర్కొంది.
అంగన్వాడీల సేవలు అత్యవసర సర్వీసులు కిందకు రానప్పటికీ… వారిని అత్యవసర సర్వీసుల కిందకు ప్రభుత్వం తీసుకువచ్చింది. ఈ మేరకు జీవో నంబర్ 2ను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. అదేవిధంగా సమ్మె చేసిన కాలానికి అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల వేతనంలో కోత విధించింది. రూ.3 వేలు తగ్గించి రూ.8050 వేతనాన్ని వారి ఖాతాల్లో జమ చేసింది.
26 రోజులుగా రోజులుగా ఏపీలో పని చేస్తున్న అంగన్వాడీలు ఆందోళన చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా దీక్ష శిబిరాలు వేసుకొని నిరసనలను వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు 1971 అత్యవసర సేవల నిర్వహణ చట్టం కింద సమ్మెను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించి సమ్మెను కొనసాగిస్తే అంగన్వాడీలను డిస్మిస్ చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. సమ్మెలో ఉన్నవారిపై ప్రాసిక్యూషన్కు అవకాశం ఉంటుంది. సమ్మె చేసిన వారికి ఆరు నెలలు జైలు శిక్ష, సహకరించిన వారికి ఏడాది జైలు శిక్ష విధించే అవకాశం ఉంది.
ఈ క్రమంలో రాష్ట్ర సచివాలయంలో మంత్రి బొత్స సత్యనారాయణ అధ్యక్షతన మంత్రుల బృందం ఆయా సంఘాల ప్రతినిధులతో చర్చలు కూడా జరిపింది. జనవరి 5 నుంచి అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు టేక్ హోం రేషన్ సహా వివిధ సరుకులు పంపిణీ చేయాల్సి ఉన్నందున సంక్రాంతి వరకూ సమ్మెను వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు.
సంక్రాంతి అనంతరం మరలా కూర్చుని చర్చించుకుని అన్ని సమస్యలను పరిష్కరించుకుందామని విజ్ణప్తి చేశారు. ఇప్పటికే అంగన్వాడీలకు సంబంధించి 11 డిమాండులకు గాను 10 డిమాండులను పరిష్కరించడమే గాక 4అంశాలకు సంబంధించి హామీలు ఇచ్చామని చెబుతున్నారు.
పదవీ విరమణ వయస్సు 60 నుండి 62 ఏళ్ళకు పెంపు, పదోన్నతి వయస్సు 45 నుండి 50 ఏళ్ళకు పెంపు, టిఏడిఏలు, అంగన్వాడీ కార్యకర్తలకు ఇచ్చే సేవా ప్రయోజనాన్ని 50 వేల రూ.లు నుండి లక్ష రూ.లకు, సహాయకులకు ఇచ్చే సేవా ప్రయోజనాన్ని 25 వేల నుండి 40 వేల రూ.లకు పెంచడం వంటి వాటిపై జిఓలను కూడా జారీ చేశామని చెబుతున్నారు.
అయితే, ఆర్థికభారం లేని డిమాండ్లపై స్పందిస్తూ కీలకమైన వేతనాల పెంపు గురించి మాత్రం మాట్లాడటం లేదు. జీతాల పెంపు, గ్రాట్యుటీపై పట్టుబడుతూ అంగన్వాడీలు సమ్మెను కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం ఎస్మా ప్రయోగించడంపై అంగన్వాడీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
