వైఎస్సార్సీపీకి మాజీ క్రికెటర్ అంబటి రాయుడు షాకిచ్చారు. గత గురువారం (డిసెంబర్ 28) పార్టీలో చేరిన రాయుడు తాను వైఎస్సార్సీపీని వీడుతున్నట్లు ప్రకటించారు. వైఎస్సార్సీపీ నుంచి బయటకు రావాలని నిర్ణయించుకున్నానని, కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉండాలనుకుంటున్నట్లు ట్విట్టర్ ద్వారా తెలిపారు. త్వరలోనే పూర్తి వివరాలను వెల్లడిస్తానని చెప్పుకొచ్చారు.
అంబటి రాయుడు వైఎస్సార్సీపీలో చేరిన పది రోజుల్లోనే వీడటం సంచలనంగా మారింది. డిసెంబర్ 28న తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో రాయుడికి వైఎస్సార్సీపీ కండువా కప్పిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు. రాజకీయాలతో తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్నట్లు రాయుడు వారం క్రితం ప్రకటించారు.
మొదటి నుంచి జగన్ మీద మంచి అభిప్రాయం ఉందని, ఆయన కులమతాలు, రాజకీయాలతో పనిలేకుండా పారదర్శకంగా పాలన చేస్తున్నారని ప్రశంసించారు. అందుకే ఆయనకు మద్దతుగా గతంలో ట్వీట్లు పెట్టినట్లు తెలిపారు. తన ప్రాంత ప్రజల సంక్షేమం కోసం పని చేస్తానని అంబటి రాయుడు చెప్పారు.
సంక్షేమ పథకాలపై చంద్రబాబు, పవన్ పవన్ కళ్యాణ్ గతంలో చాలా ఆరోపణలు చేశారని, ఇప్పుడు వారే అంతకంటే ఎక్కువ ఇస్తామని ఎలా చెప్తారని ప్రశ్నించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారన్నారు రాయుడు. అయితే పార్టీలో చేరిన వారం తర్వాత విడవడం కలకలం రేపుతోంది.
గుంటూరు జిల్లాకు చెందిన అంబటి రాయుడు కొంత కాలంగా రాజకీయాల పట్ల ఆసక్తి చూపిస్తూ వచ్చారు. కాపు సామాజిక వర్గానికి చెందిన అంబటి రాయుడుని పార్టీలో చేర్చుకోవటం లాభిస్తుందని వైఎస్సార్సీపీ భావించింది. అలాగే క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన నాటి నుంచి వైసీపీకి, సీఎం జగన్ మోహన్ రెడ్డికి సన్నిహితంగా ఉంటూ వచ్చారు.
దీంతో ఆయన వైసీపీలో చేరతారని, వచ్చే ఎన్నికల్లో గుంటూరు జిల్లాలో ఏదో ఒక స్థానం నుంచి బరిలో ఉంటారంటూ వార్తలు వచ్చాయి. అనుకున్నట్లుగానే సీఎం జగన్ సమక్షంలో అంబటి రాయుడు వైసీపీ కండువా కప్పుకున్నారు. ఇప్పుడు రాజీనామాను ప్రకటించారు. వేరే పార్టీలో చేరే ఉద్దేశంలో అంబటి రాయుడు ఉన్నారా? అంటూ ప్రచారం జరుగుతోంది.