గాజా ప్రాంతంపై బాంబు దాడులను ముగించిన తర్వాత ఆ ప్రాంతంలో ఏం చేయాలనే ప్రణాళికలను ఇజ్రాయిల్ వెల్లడించింది. ‘విజన్ ఫర్ ఫేజ్ త్రీ’ పేరుతో రక్షణ మంత్రి యోవ్ గాలంట్ పంచుకున్న పత్రంలో ఈ వివరాలు వున్నాయి. ఈ ప్రణాళికల వివరాలను ఈ వారంలో ప్రధాని బెంజమిన్ నెతన్యాహు యుద్ధ కేబినెట్‌కు అందజేశారు.
గాజా స్ట్రిప్ పౌర పాలనా యంత్రాంగాన్ని ఇజ్రాయిల్ మార్గనిర్దేశకత్వంలో పనిచేసే పాలస్తీనా సంస్థకు అందజేయనున్నట్లు ఆ ప్రణాళిక పేర్కొంది. రోజువారీ పాలనా వ్యవహారాలను ఈ సంస్థ పర్యవేక్షిస్తుంది. భద్రతా నియంత్రణ ఇజ్రాయిల్ అదుపులో వుంటుంది. అవసరమైనంత కాలమూ గాజా దక్షిణ ప్రాంతంలో హమాస్‌తో పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉత్తర గాజాలో స్థాయి తగ్గించిన ‘కొత్త పోరాట విధానానికి’ ఇజ్రాయిల్ బలగాలు ఏ విధంగా మారతాయో గాలంట్ ఆ ప్రణాళికలో వివరించారు.
గాజాలో చర్యలు తీసుకునే హక్కును ఇజ్రాయిల్ అట్టిపెట్టుకుంటుంది. అంటే తమకు ఇష్టమైనపుడల్లా బలగాలు వచ్చి వెళ్లే వీలు వుంటుంది. పాలస్తీనా అథారిటీ ప్రధాని మహ్మద్ షటయె మాట్లాడుతూ, అంతిమంగా ఏర్పాటు చేసే ఏ అమరిక అయినా కూడా ‘మొత్తంగా పాలస్తీనాకు రాజకీయ పరిష్కారం అందించేలా వుండాలి’ తప్పితే కేవలం గాజాకు పరిష్కారం అందించేలా వుండరాదని స్పష్టం చేశారు.
వెస్ట్ బ్యాంక్ నుండి రాజకీయంగా గాజాను వేరు చేయాలని ఇజ్రాయిల్ భావిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. గాజాను అతి త్వరలోనే వీడి ఇజ్రాయిల్ వెళుతుందని తాను భావించడం లేదని పేర్కొన్నారు. ఇజ్రాయిల్ ఆక్రమిత ఆర్మీ నేతృత్వంలో తన స్వంత పాలనా యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఇజ్రాయిల్ భావిస్తోందని చెప్పారు.
గాజాలో యుద్ధానంతరం చేపట్టే చర్యలు, ప్రణాళికలను వెల్లడించాల్సిందిగా అంతర్జాతీయంగా ఒత్తిడి వస్తున్నా ఇజ్రాయిల్ వెల్లడించకుండా మౌనం వహిస్తున్నది.