* ట్రెండ్ అవుతున్న `బాయ్‌కాట్ మాల్దీవ్స్’ హ్యాష్ట్యాగ్గతేడాది నవంబర్ దాకా భారత్, మాల్దీవుల మధ్య సత్సంబంధాలు ఉండేవి. అక్కడి అందాల్ని వీక్షించడం కోసం మన భారత్ నుంచి లక్షలాది మంది పర్యాటకులు వెళ్లేవాళ్లు. సాధారణ ప్రజల దగ్గర నుంచి సెలెబ్రిటీల దాకా ఈ మాల్దీవులను సందర్శనకు అధిక ప్రాధాన్యత ఇచ్చేవారు.
కానీ.. ఇప్పుడు పరిస్థితులు అందుకు భిన్నంగా మారిపోయాయి. ఎవరైతే నిన్నటిదాకా మాల్దీవుల్ని నెత్తిమీద పెట్టుకున్నారో ఇప్పుడు వాళ్లే దీనిని బాయ్‌కాట్ చేయాలని పిలుపునిస్తున్నారు. ఇప్పటికే చాలామంది తమ మాల్దీవుల ట్రిప్‌ని రద్దు చేసుకున్నారు.
సెలెబ్రిటీలు సైతం ఈ ట్రెండ్‌లోకి చేరిపోయి భారత్‌కి మద్దతు ఇస్తున్నారు. దీంతో.. #BoycottMaldives అనే హ్యాష్‌ట్యాగ్ నెట్టింట్లో ట్రెండ్ అవుతోంది. అసలు ఎందుకు ఇది ట్రెండింగ్‌గా మారింది. దానితో నష్టనివారణ చర్యగా మాలీద్వీప్ ప్రభుత్వం ముగ్గురు మంత్రులను సస్పెండ్ చేసింది.
ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర పాలిత ప్రాంతం లక్షద్వీప్‌లో పర్యటించారు. అక్కడ సముద్రం ఒడ్డున కాసేపు సేద తీరడంతో పాటు సముద్రంలో స్నార్కెలింగ్ చేసిన మోదీ సాహసాలు చేయాలనుకునే వారు తమ లిస్ట్‌లో లక్షద్వీప్‌ను కూడా చేర్చుకోవాలని కోరారు. దీనిపై మాల్దీవులు ఎంపీ జహీద్ రమీజ్ అక్కసు వెళ్లగక్కారు.
పర్యాటక రంగంలో మాల్దీవులతో పోటీ పడలేరని, లక్షద్వీప్ ఎన్నో సమస్యలను ఎదుర్కొంటోందని ట్వీట్ చేశారు. తమ దేశం అందించే సర్వీసుల్ని అక్కడ అందించలేరని, అక్కడి గదుల్లో వచ్చే వాసన అతిపెద్ద సమస్య అని జహీద్ తన ట్వీట్లో పేర్కొన్నారు.
దీంతో మండిపడ్డ భారతీయులు.. పర్యాటకంగా మాల్దీవుల్ని బహిష్కరించాలని కామెంట్లు చేస్తున్నారు. #BoycottMaldives ట్రెండ్‌కి మద్దతు ఇస్తూ కొందరు సెలెబ్రిటీలు రంగంలోకి దిగారు.
మాల్దీవులకు చెందిన ప్రముఖ ప్రజాప్రతినిధులు భారతీయులపై ద్వేషపూరిత, జాత్యహంకార వ్యాఖ్యలు చేస్తున్నారని.. అత్యధిక సంఖ్యలో పర్యాటకులను పంపే దేశం పట్ల వాళ్లు ఇలా ప్రవర్తించడం ఆశ్చర్యానికి గురి చేస్తోందని అక్షయ్ కుమార్ పేర్కొన్నారు. పొరుగువారితో మనం మంచిగా వ్యవహరిస్తుంటే, వాళ్లు మాత్రం ద్వేషం ప్రదర్శిస్తున్నారని.. మన స్వంత పర్యాటకానికి మద్దతివ్వాలని నిర్ణయించుకుందామని ఆయన పిలుపునిచ్చారు.
నటి శ్రద్ధా కపూర్ సైతం.. లక్షద్వీప్‌లో అందమైన బీచ్‌లు, తీరప్రాంతాలు ఉన్నాయని, సెలవుల్లో తాను అక్కడికే వెళ్లాలని కోరుకుంటున్నానని ఎక్స్ వేదికగా తెలిపింది.
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అయితే.. లక్షద్వీప్ బీచ్ వద్ద క్రికెట్ ఆడుతున్న వీడియోని షేర్ చేస్తూ, అక్కడి అనుభవాల్ని పంచుకున్నారు. ఈ తీర ప్రాంతం మనం కోరుకునే దాని కన్నా ఎక్కువగా ఇస్తుందని, అద్భుతమైన ఆతిథ్యంతో కూడిన ఈ అందమైన ప్రదేశాలు తమకు జ్ఞాపకాల నిధిని మిగిల్చాయని కొనియాడారు.
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ కూడా ఈ ట్రెండ్‌లోకి దిగి.. లక్షద్వీప్‌లోని అందమైన బీచ్‌ల్లో ప్రధాని మోదీ సందర్శించడం చూసి ఆనందంగా ఉందని, ఇది మన భారత్‌లోనే ఉండటం సంతోషకరమైన విషయమని చెప్పారు. ఇలా ఇతర సెలెబ్రిటీలు లక్షద్వీప్‌కి మద్దతుగా ట్వీట్ చేస్తూ.. మాల్దీవులకు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు.