గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు మరోసారి బెదిరింపు కాల్స్ రావటం ఇప్పుడు కలకలం రేపుతోంది. నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలిచే బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు గతంలో కూడా పలుమార్లు బెదిరింపు కాల్స్ రాగా ఇప్పుడు కూడా వార్నింగ్ కాల్స్ వచ్చాయని ఆయనే స్వయంగా తెలిపారు.
శ్రీరామనవమి రోజున శోభయాత్ర తీస్తే చంపేస్తామని కొందరు ఫోన్లు చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ రాజాసింగ్ వీడియో విడుదల చేశారు. ఫోన్లు చేసి బెదిరించడం కాదని, దమ్ముంటే నేరుగా రావాలని రాజాసింగ్ ఛాలెంజ్ చేశారు. గతంలోనూ ఇలాగే బెదిరింపు కాల్స్ వచ్చాయని రాజాసింగ్ చెప్పుకొచ్చారు.
నమ్మిన సిద్ధాంతం కోసం తాను ఎంత దూరమైనా వెళ్తానని, ఇలాంటి బెదిరింపులు తనను ఏం చేయలేవని స్పష్టం చేశారు. బెదిరింపులకు పాల్పడేవారు ఎంత స్థాయి వ్యక్తులైనా తనకు అనవసరమని, దమ్ముంటే నేరుగా రావాలని, లేకుంటే ఫోన్లు చేయడం మానుకోవాలని వీడియోలో రాజాసింగ్ హితవు చెప్పారు.
అయితే తనకు ఏ ఏ నెంబర్ల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయో కూడా రాజాసింగ్ వీడియోలో తెలిపారు. 7199942827, 4223532270 నెంబర్ల నుంచి బెదిరింపు కాల్స్ వచ్చినట్టు వివరించారు. అయితే, జనవరి 22న అయ్యోధ్యలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ జరగనున్న నేపథ్యంలో రాజాసింగ్‌కు ఇలాంటి బెదిరింపు కాల్స్ రావడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
కాగా, గత కొంత కాలం కిందట కూడా ఎమ్మెల్యే రాజాసింగ్‌ను చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్ వచ్చాయి. అయితే.. ఆ కాల్స్ పాకిస్థాన్ నుంచి వస్తున్నాయంటూ సోషల్ మీడియాలో రాజాసింగ్ వీడియోలు కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే. తనను చంపుతామంటూ కాల్స్ వస్తున్నాయని అప్పటి డీజీపీ అంజనీ కుమార్‌కు రాజాసింగ్ లేఖ కూడా రాశారు. ఇప్పటివరకు తనకు ఏఏ నెంబర్ల నుంచి కాల్స్ వచ్చాయో ఆ జాబితాను కూడా లేఖలో రాజాసింగ్ పేర్కొన్నారు.