తుది ఓటర్ల జాబితా విడుదల చేశామని, ఆంధ్ర ప్రదేశ్ లో మొత్తంగా 4.08 కోట్ల ఓటర్లున్నారని ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ఎంకే మీనా వెల్లడించారు. వీరిలో పురుషులు 2,00,09,275 మంది కాగా, మహిళలు 2,07,37,065 మంది ఉన్నారు. థర్డ్ జెండర్స్ 3,482, సర్వీస్ ఓటర్లు 67,434 మంది ఉన్నారు. పోలింగ్ స్టేషన్ల సంఖ్యను 45,951 నుంచి 46,165కు పెంచారు.
ముసాయిదా ఓటర్ల జాబితాతో పోల్చుకుంటే 5.85 లక్షల ఓటర్ల మేర పెరిగారని ఆయన చెప్పారు. 18-19 మధ్య వయస్సున్న యువ ఓటర్లు- 8.13 లక్షల మంది ఉన్నారని తెలిపారు. అయితే, యువ ఓటర్ల సంఖ్య ఇంకా పెరగాల్సి ఉందని చెబుతూ దీనిపై ప్రచారం చేపడతామని తెలిపారు.
ఓటర్ల జాబితాపై వచ్చిన ఫిర్యాదుల్లో చాలా వరకు పరిష్కరించామని ఈ సందర్భంగా చెప్పారు. ఒకే ఇంట్లో పది మందికి పైగా ఓటర్లున్నారనే ఫిర్యాదులను సుమారు 98 శాతం వరకు పరిష్కరించామని వెల్లడించారు. 14 లక్షల ఓటర్లకు సంబంధించి రాజకీయ పార్టీల నుంచి ఫిర్యాదులు వచ్చాయని, ఈ ఫిర్యాదులను పరిశీలించి 5.64 లక్షల ఓట్లను తొలగించామని చెప్పారు.
ఫాం-7 దుర్వినియోగం చేస్తున్నారనే ఫిర్యాదుల పైనా ఫోకస్ పెట్టామని పేర్కొంటూ ఓటర్ల జాబితా అవకతవకలకపై ఏపీలో మొత్తంగా 70 కేసులు నమోదయ్యాయని తెలిపారు. నామినేషన్ చివరి రోజు వరకు ఓట్లని నమోదు చేసుకోవచ్చని మీనా వెల్లడించారు. ఇప్పటికీ ఓటర్ల జాబితాలో ఏమైనా తప్పిదాలు ఉంటే ఆ అభ్యంతరాలను స్వీకరిస్తామని హామీ ఇచ్చారు.
ప్రతి ఓటరు తన పేరుని ఓటర్ లిస్టులో చెక్ చేసుకోవాలని మీనా సూచించారు. కాగా,ఎపిక్ కార్డుల డౌన్ లోడ్ విషయంలో ఓ ఐఏఎస్ అధికారి సహా ముగ్గురు సస్పెండ్ అయ్యారని ఆయన చెప్పారు. ఎపిక్ కార్డుల డౌన్ లోడ్ వ్యవహారం వెనుక ఎవరున్నారోననే అంశంపై దర్యాప్తు చేస్తున్నామని వివరించారు.